18 April, 2026 | 2:22 AM

మహిళా పోలీసుల సాధికారతే లక్ష్యం

18-04-2026 12:50 AM

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి

కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): మహిళా పోలీసుల సాధికారత లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ - అలైవ్‘ రోడ్డు భద్రత వారోత్సవాల్లో శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారుపాల్గొన్నారు.

అనంతరం షీ లీడ్స్ మహిళా పోలీసుల ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారై మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం సివిల్ విభాగంలో 33 శాతం, ఏఆర్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు డీజీపీ తెలిపారు. తెలంగాణలో ప్రారంభమైన ’షీ టీమ్స్’ నమూనాను నేడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ఆయన కొనియాడారు.

2016లో హైదరాబాద్లో ప్రారంభమైన ’భరోసా’ కేంద్రాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాలకు విస్తరించాయని, వీటి పనితీరును సుప్రీంకోర్టు సైతం అభినందించడం రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణ కోసం 40 మంది బ్లూ కోల్ట్ సిబ్బందికి 20 స్కూటీలు, పెప్పర్ స్ప్రేలు, హాట్ బాక్సులను డీజీపీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలం, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.