అర్హులైన ప్రతి ఒక్క ఓటు కాపాడుకోవటమే లక్ష్యం
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి
- బొంగులూర్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ బీఎల్‌ఏలకు శిక్షణా కార్యక్రమం
- హాజరైన ఎంపీ చామల, పీసీసీ ట్రైనింగ్ కమిటీ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, జూన్ 14 (విజయక్రాం తి):రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) వేళ నియోజకవర్గంలో అర్హులైన ప్రతిఒక్క ఓటు కాపాడుకోవటమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పిలు పునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేర కు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెం దిన బూత్ లెవెల్ ఏజెంట్స్ కు శిక్షణా కార్యక్రమాన్నిబొంగ్లూర్ గేటు వద్ద ప్రమిదా గార్డె న్స్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ట్రైనింగ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో కాంగ్రెస్ ఓట్లు పెద్ద ఎత్తున తొలగించబడినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే... పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని చెప్పారు. బీఎల్‌ఓలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో సాగుతూ.. ఒక్క ఓటు కూడా వృథా అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పారు. అనంతరం, ఎంపీ చామల మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీపై జరిగే కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరించే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా యాక్టివ్గా ఉండి, ప్రతి ఇంటినీ సందర్శించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రైనింగ్ కమిటీ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బీఎల్‌ఏల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.
ఎలాంటి పొరపాటు గమనించినా వెంటనే గుర్తించాలని చెప్పారు. అభ్యంతరాలపై అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉన్నందున, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. నియోజకవర్గ బీఎల్‌ఓల శిక్షకుడు చైతన్య కృష్ణారెడ్డి.. ఓటరు జాబితా పరిశీలన, సవరణల ప్రక్రియ, ఇంటింటికి నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం వంటి అంశాలపై వివరంగా సూచనలు అందజేశారు. ఈ శిక్షణా కార్యక్రమానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్, పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.






