18 June, 2026 | 10:39 AM

కల్వకుర్తిని స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

18-06-2026 09:40 AM

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి జూన్ 17: కల్వకుర్తి నియోజకవర్గ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించి స్కిల్ హబ్ గా మార్చడమే లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం అమెరికాకు చెందిన ఇన్ఫో డాట్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గంలో 5,000 మంది యువతకు ఏఐ, ఐటి, డేటా అనలిటిక్స్, డిజిటల్ టెక్నాలజీస్, సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలపై శిక్షణ అందించడమే లక్ష్యమని తెలిపారు. ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో కల్వకుర్తి యువత కోసం ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగం వేగంగా మారుతోందని, కేవలం డిగ్రీలు కాకుండా నైపుణ్యాలే ఉద్యోగాలకు ప్రధాన అర్హతగా మారాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మార్గదర్శకత్వం, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన అవకాశాల కొరత వల్ల వెనుకబడుతున్నారని పేర్కొంటూ, ఈ పరిస్థితిని మార్చడానికే “ఐక్యత ఫౌండేషన్ – స్కిల్ ఫ్యాక్టరీ” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, డిజిటల్ టూల్స్ వినియోగం, ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్ అవకాశాలు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి, కెరీర్ గైడెన్స్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వివరించారు. యువత సాధికారతే లక్ష్యంగా ఇప్పటికే ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ, కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక కార్యక్రమాలను ఐక్యత ఫౌండేషన్ నిర్వహిస్తోందని తెలిపారు. ఇప్పుడు భవిష్యత్ తరాలకు అత్యంత అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అన్నారు.