19-10-2025 01:03:47 AM
-విధుల్లో సిబ్బంది తటస్థంగా ఉండాలి
-జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్
హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, పారదర్శ కంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా, పోలింగ్ విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు , సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది కోసం శనివారం బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో మొదటి విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2,300 మందికి పైగా సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ రోజు అత్యంత కీలకమని, సిబ్బంది తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తటస్థంగా ఉంటూ, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా పోలింగ్ జరిగేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విధులను సిబ్బందికి వివరించారు. మాస్టర్ ట్రెయినర్లు ఈవీఎంల పనితీరుపై సిబ్బందికి అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమాల బాధ్యులు సునంద, మమత తదితరులు పాల్గొన్నారు.