పేదల సొంతింటి కల నిజం కావడమే ‘ప్రజాపాలన’ లక్ష్యం : ఎమ్మెల్యే కసిరెడ్డి
కడ్తాల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సొంతింటి కల, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సాకారం అవుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కడ్తాల్ మండలంలోని గానుమర్లతండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నూతనంగా నిర్మించుకున్న గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గానుమర్లతండాకు చెందిన లబ్ధిదారులు నేనావత్ కమలి, ఇస్లావత్ భీమన్, నేనావత్ రాంలీ, నేనావత్ సునీత, మంగలలు తమ నూతన గృహాలలో గృహప్రవేశం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ యాట గీతతో కలిసి రిబ్బన్ కట్ చేసి సామూహికంగా ఇళ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఒకే సారి ఇచ్చేది కాదని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు అందే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని కొనియాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైనా సరే, సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలను గుర్తించి వారికి త్వరితగతిన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన అంటేనే సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటం.
ఇందిరమ్మ రాజ్యం మళ్లీ వచ్చిందని చెప్పడానికి ఈ గృహప్రవేశాలే నిదర్శనం. ఎమ్మెల్యే కసిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమం లో ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, సర్పంచ్ సేవ్యనాయక్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మ నాయక్,మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,డీసీసీ అధికార ప్రతినిధి బిక్యా నాయక్, ఉప సర్పంచ్ లక్పత్ నాయక్, నాయకులు మోత్య నాయక్, హీరా సింగ్, పాండు, రాజు లు పాల్గొన్నారు.




