సోయా పంట కొనని ప్రభుత్వం
- నాణ్యత లేమి, తేమ శాతం పేర సాకులు
- ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డ్‌లో బస్తాల మీద మోకాళ్లపై కూర్చుని రైతుల నిరసన
- పంటను ఇంటికి తీసుకెళ్తూ ఆవేదన
ఆదిలాబాద్/బేల, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అమ్ముకోవడానికి సైతం నానాతంటాలు పడాల్సి వస్తోంది. సోయా పంటను ఎంతో ఆశగా మార్కెట్ యార్డుకు తీసుకువస్తే నాణ్యత లేదని, తేమ శాతం అని సాకుతో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో రైతులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మకానికి తీసుకువచ్చిన సోయా పంటను 45 రోజులుగా వేచి ఉన్నా కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ యార్డులో రైతులు వినూత్న నిరసనకు దిగారు. పంట బస్తాలపై మోకాళ్లపై కూర్చొని, చేతులతో చెవులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. పంటను మార్కెట్‌కు తీసుకువస్తె ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని ఆరోపించారు.
అనంతరం రైతులు తమ పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మార్కెట్ సిబ్బంది సొయా పంటను బార్ కోడ్ వారీగా తూకం చేసి వాపస్ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు, సినిమా ఇండస్ట్రీ సిబ్బంది ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే వారి సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వం.. పంటకు మద్దతు ధర కల్పించాలని తాము కోరితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి డబ్బులు అవసరం ఉన్నందున పంటను ప్రైవేట్ వ్యాపారస్తులకు తక్కువ ధరకే అమ్మల్సిన దుస్థితి వచ్చిందని దిగాలు చెందారు.






