calender_icon.png 15 September, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల బాటతో సర్కారుకు వణుకు

16-12-2024 01:02:36 AM

  1. రాష్ట్ర స్థితిగతులపై బహిరంగ చర్చకు రావాలి
  2. సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ 

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర స్థితిగతులపై అమరవీరుల స్థూపం వద్ద బహిరంగ చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి రావాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గురుకులాల బాట పట్టి కేసీఆర్‌కు నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రవీందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో 53 మంది విద్యార్థులు మరణించినా స్పందించకుండా.. నేడు మెనూ పేరుతో మంత్రులు పలు పాఠశాల్లో హడావుడి చేశారని ఎద్దేవా చేశారు.

పిల్లలతో అధికార పార్టీ నేతలంతా పిక్నిక్ చేసినట్టు ఉందని, ఫోటోలకు ఫోజులిస్తూ కేసీఆర్‌ను విమర్శించి చేతులు దులుపుకున్నారని వివర్శించారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ను  ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో డైట్ ఛార్జీలను రూ.1,500కు పెంచి సన్నబియ్యం, మటన్‌తో భోజనం పెట్టామని గుర్తు చేశారు.

కేసీఆర్ పాలనలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ఇచ్చే మెనూకు ఏం తేడా లేదన్నారు. రేవంత్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తల్లిని రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి అని అంటున్నారని, ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. చిలుకూరులో రేవంత్ ముందు విద్యార్థులు కనబరిచిన ప్రతిభాపాటవాలు కేసీఆర్ హయంలో తీసుకున్న చర్యల ఫలితమేనన్నారు.