calender_icon.png 15 September, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

15-09-2025 11:26:20 AM

చికిత్స పొందుతూ యువతి మృతి

అబ్దుల్లాపూర్ మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్(Abdullapurmet Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ సౌమ్య రెడ్డి (25) హైదరాబాదులో ఉంటూ ఇన్ఫోసిస్ ప్రవేట్ కంపెనీలో పనిచేస్తుంది. ఆదివారం వీకెండు కావడంతో సౌమ్య రెడ్డి తన స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర (26) ప్రణీత్, సాగర్, అరవింద్, శృతిలతో కలసి టీఎస్ 07_ఎఫ్ క్యూ _3399 నెంబర్ గల ఇనోవా వాహనంలో యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండలం పరిధిలోని సరళ మైసమ్మ దేవాలయానికి సందర్శన కోసం వెళ్లారు.

అనంతరం తిరిగి ఇబ్రహీంపట్నం నుంచి  ఘట్కేసర్ బయల్దేరే మార్గమధ్యలో బొంగులూరు ఎగ్జిట్ 10, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బలిజగూడ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం మితిమీరి వేగంతో ఉండడం వలన కారు అదుపుతాపు డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పెద్ద అంబర్‌పేట్ ఎదురుగా ఉన్న రోడ్డు వైపుకు తిరిగింది. కారులో ప్రయాణిస్తున్న  అందరికీ తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే వారిని హయత్‌నగర్‌లోని సన్ రైజు హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం సౌమ్య రెడ్డి, నందకిషోర్ లను ఉప్పల్ లోని  సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సౌమ్య రెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ వి అశోక్ రెడ్డి తెలిపారు.