16-12-2024 01:04:54 AM
ఈ నెలాఖరులో 200 ఆస్తులకు అవార్డులు
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15(విజయక్రాంతి): ఓల్డ్ సిటీలో మెట్రో రైల్‌ను పట్టాలెక్కించేందుకు భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎంజీబీఎస్ కారిడార్ నిర్మాణం కోసం ముమ్మరంగా పనులు జరుగుతున్నట్లు హెచ్‌ఏఎంఎల్ (హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్గంలో గుర్తించిన 1,100 ఆస్తుల సేకరణ చకచకా సాగుతోందని తెలిపారు. భూసేకరణ చట్టానికి లోబడి సేకరిస్తున్న ఈ ఆస్తుల్లో ఇప్పటి వరకు 900 ఆస్తుల రిక్విజిషన్‌ను జిల్లా కలెక్టర్‌కు సమర్పించామని, వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను కలెక్టర్ దఫదఫాలుగా జారీ చేశారని ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడిం చారు.
200 ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డుల ప్రకటన ఈ నెలాఖరులో పూర్తవుతుందని వెల్లడించారు. తదనంతరం వాటికి పరిహారం చెల్లించి, కూల్చివేత పనులు చేపడతామని, మెట్రో రైల్ కారిడార్ నిర్మాణాన్ని సుగమం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ఆస్తుల యజమానులతో సానుకూలంగా చర్చించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
ఆకర్షణీయంగా.. కాలుష్యరహితంగా
ఎంజీబీఎస్ కారిడార్‌లో మతపరమైన చారిత్రక కట్టడాలకు ఇబ్బందులు కలగకుండా ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌తో పరిరక్షిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో రాకతో పాతబస్తీ ఆకర్షణీయంగా మారడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరు గవుతాయన్నారు.ఈ ప్రాంతంలో కాలుష్యం తగ్గి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ భూసేకరణ ప్రక్రియపై తాను, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు. పనుల పురోగతిని సీఎం రేవంత్‌రెడ్డికి వివరిస్తున్నట్లు చెప్పారు.