బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
పంజాగుట్ట, జూన్ 11 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో కీచకుడి దురాగతానికి ఓ బాలిక ఆసుపత్రి పాలైంది. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆ బాలికను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని తెలిపారు. పరామర్శ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భవనంపై నుంచి బాలికను తోసేయడం వల్ల వెన్నుముకతో పాటు చాలా చోట్ల ఎముకల్లో పగుళ్లు వచ్చాయన్నారు.
బాధిత బాలిక కోలుకునేందుకు మూడు నెలల సమయం పట్టొచ్చని వైద్యులు తెలిపారన్నారు. అందుకు సంబంధించిన చికిత్సకు ఎంత ఖ్చనా కూడా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. బాలిక తల్లిదండ్రులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని మహిళ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. వైద్య నిపుణులను కూడా పిలిపించి అత్యుత్తమ వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. భగవంతుడి దయవల్ల బాలిక కోలుకోవాలని ఆకాంక్షించారు.






