12 June, 2026 | 1:22 AM

20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలి

12-06-2026 12:00 AM
  1. నిరుద్యోగ జేఏసీ డిమాండ్
  2. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో మహా ధర్నా
  3. ఆందోళనకారుల అరెస్టు- లైబ్రరీ వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం

ముషీరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): నిరుద్యోగ యువత హక్కుల పరిరక్షణ కోసం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. ధర్నా అనంతరం నిరుద్యోగులు అశోక్నగర్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

లైబ్రరీ ప్రధాన గేటును మూసివేసి భద్రతా చర్యలు చేపట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు రవికుమార్, అయ్యా వెంకటేష్ మాట్లాడుతూ కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్త్స్ర అభ్యర్థుల వయోపరిమితిని 38 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కేవలం 5 వేల పోస్టులతో కాకుండా 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. జీవో నెం.46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా రవికుమార్, అయ్యా వెంకటేష్, కిరణ్, రాజు, బాలకోటి, సురేష్ తదితర నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనతో చిక్కడపల్లి ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.