10 April, 2026 | 2:13 AM

మక్కజొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

10-04-2026 12:39 AM

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్

హనుమకొండ టౌన్, ఎప్రిల్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు కనీస మద్దతు ధర లేక, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు.

తెలంగాణ ప్రజల ను, ముఖ్యంగా వెన్నెముక లాంటి రైతును ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక రైతులు మార్కెట్లలో పడిగాపులు కాస్తుంటే, ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి, తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మక్కజొన్న కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలన్నారు. మద్దతు ధర లభించేలా చూసి, అన్నదాతలను ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలన్నారు. మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్  పాల్గొన్నారు.