13 July, 2026 | 1:50 AM

నీటి సమస్యపై రాజకీయాలు కాదు..

13-07-2026 12:00 AM

నిపుణుల సూచనలే ప్రామాణికం

కాళేశ్వరంపై కేంద్ర నివేదికను ప్రభుత్వం పట్టించుకోవాలి

‘పాలమూరు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్

ఆగస్టు 6 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ పాదయాత్రలు

ఎమ్మెల్యే కూనంనేని

వనపర్తి, జూలై 12 (విజయక్రాంతి): రాష్ట్రములో నీటి సమస్యపై రాజకీయాలు కాదు నిపుణుల సూచనలే ప్రామాణికం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని నీటి సమస్యల వంటి కీలక అంశాలపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు.

అసలు సమస్యను పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలు, ప రస్పర దూషణలు చేయడం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ఫ్యాషన్గా మారిందని ఆయ న విమర్శించారు. ఇటువంటి రాజకీయ సంస్కృతిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని, అన్ని రాజకీయ పార్టీలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కన్నెపల్లి పంపుల నుంచి నీటిని విడుదల చేయాలా వద్దా అనే అంశంపై రాజకీయ వాదోపవాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

బీఆర్‌ఎస్ నాయకులు నీటిని విడుదల చేయవచ్చని చెబుతుండగా, మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఈ విషయంలో రాజకీయ నాయకుల అభిప్రాయాల కంటే నిపుణుల సూచనలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై జాతీయ డ్యామ్ భద్రత సంస్థ కేంద్రానికి నివేదిక ఇచ్చి మూడేళ్లు గడిచినా తగిన చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ వంటి నాయకులకు సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన ఉండదని, నిపుణులు చెప్పిన దానినే పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన హితువు పలికారు . రాజకీయ నాయకులు విధానపరమైన నిర్ణయాలకే పరిమితం కావాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ రంగంలో కాళేశ్వరం చుట్టూనే తిరుగుతోందని, ప్రాణహిత వంటి ఇతర కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టుపై కొంత అదనపు వ్యయం చేస్తే ఉత్తర తెలంగాణలో వలసలు తగ్గి అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినట్లే, తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి దేశ ప్రజలంతా విరాళాలు ఇచ్చారని, అయితే నిధుల వినియోగంపై వస్తున్న ఆరోపణలు, కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రేమతో కాదు, తెలంగాణలో రాజకీయ అధికారం సాధించాలనే లక్ష్యంతోనే కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆగస్టు 6 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.