శ్రీనివాస్‌రెడ్డి సేవలు ఎనలేనివి
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కృషి మరువలేనిది
- టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి
మెదక్, జులై 12(విజయక్రాంతి): కార్మికుల హక్కుల సాధనలో పీ శ్రీనివాస్‌రెడ్డి సేవలు ఎనలేనివి. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాత్ర అమోఘమని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి కొనియాడారు. ఆదివారం మెదక్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్‌లో అకౌంటెంట్ శ్రీనివాస్ రెడ్డి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. దశాబ్దాలపాటు నిజాయితీతో అకౌంటెంట్‌గా విధులు నిర్వహించిన పీఎస్ శ్రీనివాస్‌రెడ్డిని సహోద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగం నుంచి పదవీ విరమణ సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, సమాజానికి చేసిన సేవలే శాశ్వత గుర్తింపును తీసుకొస్తాయన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణలో శ్రీనివాస్ రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో ఉద్యోగులు, కార్మికులను ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డిని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర నాయకులు థామస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కృష్ణారెడ్డి, మేడి రాధా కిషన్ రావ్, శాఖయ్య, దశరథ్ రెడ్డి, అశ్వక్ హైమద్‌లతో పాటు ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు,ఉద్యోగ సంఘాల నాయకులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






