వ్యవసాయరంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): వ్యవసాయ రంగ బలోపేతం, రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో డీసీసీబీ ఏర్పాటుచేసిన నూతన బ్యాంకు శాఖను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ రైతులు, మహిళలకు ఆర్థికంగా బలంగా నిలబడేందుకు ఇటువంటి బ్యాంకింగ్ సేవలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రఘునాథపల్లిలో బ్యాంకు బ్రాంచ్ ప్రారంభం కావడం సంతోషకరమని, స్థానికులకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ భూమిని ఆధారంగా చేసుకుని విద్యారుణాలు అందించడం అభినందనీయమని ఎంపీ అన్నారు.
బంగారు రుణాల రూపంలో ఇప్పటికే రూ.541 కోట్ల వరకు సహాయం అందించడాన్ని ప్రస్తావిస్తూ, సహకార బ్యాంకులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని చెప్పారు. బ్యాంకు సేవలను రైతులు, మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత పురోగతి సాధించాలని కోరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
వరంగల్ డీసీసీబీ ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థగా ప్రజాసేవలో, ముఖ్యంగా రైతు సేవలో ముందంజలో ఉండడం సంతోషకరమని తెలిపారు. నాబార్డ్ సహకారంతో డీసీసీబీ బ్యాంకులు మరింత బలోపేతం అవుతున్నాయని, ప్రతి మండలంలో ఇలాంటి బ్యాంకు ఉంటే ప్రజలకు మరింత సేవలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
అవసరమైతే వరంగల్ డీసీసీబీ బ్రాంచ్ ల పెంపు పై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సహకారంతో ఆర్బీఐతో చర్చించి మరిన్ని సేవలు పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రుణాల మంజూరు విషయంలో డీసీసీబీ ప్రథమ స్థానంలో నిలుస్తోందని, రైతులు, మహిళా సంఘాలు రుణాలను క్రమం తప్పకుండా చెల్లించినప్పుడే బ్యాంకులకు మంచి పేరు వస్తుందని సూచించారు.
రఘునాథపల్లి ప్రాంత రైతులు డీసీసీబీ సేవలను వినియోగించుకోవాలని, ఇన్పుట్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు వంటి ప్రత్యేక రుణాలు కూడా వరంగల్ డీసీసీబీ ద్వారా అందుబాటులో ఉన్నా యని తెలిపారు. మహిళా సంఘాల రుణా లు విస్తృతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. డిసిసిబి బ్యాంకు సీఈవో వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎంలు చంద్రశేఖర్, చైతన్య రవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాం బాబు, సర్పంచ్ ఉమారాణి పాల్గొన్నారు.






