కర చరణాల దస్తూరి
అశోక బుద్ధుల్లారా
నాయక మెదళ్లని ఆవహించండి
సైనికులుగా మారిపోతున్నారు పౌరులంతా
పాలపిట్టలుగా పలవరించడం లేదు
‘పట్టుకోండి పట్టుకోండి’ అని ఆడే
పాలబుగ్గల పరుగులు కావివి
రుధిరాన్ని చమురుగా చేసి
దేహాలకి నిప్పంటిస్తే తీసే దాడులివి
ఒక ఓడ వస్తే
బతుకు బడి సాగినట్లే అని
సాగిలబడి దండాలు పెడుతున్న జనం
ఇరుగు పొరుగు ఇళ్లకి వెళ్లే ఇంధనం
గాదెల్లో నింపుకున్నట్లే అని
నిబ్బరపడుతున్న ప్రజ
కర చరణాల దస్తూరి కాదిది
గజ్జెల నాట్య దస్తూరి కాదిది
తన్మయత్వ ప్రాణ ఊపిరి
పోయడానికి !
బాంబుల మోత దస్తూరి తో
మనుషుల పాలిట ఆడే మత్యుక్రీడ ఇది
నేలని సాగు చేయడం కాదిది
పంటల నెలవు కావడానికి !
నిర్మాణాలని నేలమట్టం చేయడమిది
గరిక కూడా మొలవకుండా చేయడమిది
‘ఆనందో బ్రహ్మ’ ఆలాపన
ఎప్పుడూ అల్లంత దూరానే,
అందని ఆలస్యమే !
ఆకుపచ్చ వసంతం
ఆకురాయిలా పనిచేసేది ఎప్పుడో !
‘గాంధేయం ఓ గాంఢీవం’ దిశగా
అడుగులు పడేది ఎప్పుడో !
‘అమృత మోక్షపు మనిషి’
ఆవిర్భవించేది ఎప్పుడో !
ఒబ్బిని




