31 May, 2026 | 1:02 AM

కొలువుతెచ్చిన గౌరవం!

31-05-2026 12:12 AM
  1. హైడ్రాలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ అవకాశం
  2. 16 మందితో ఈగల్ టీం 
  3. సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఆనందం

సికింద్రాబాద్, మే29 (విజయక్రాంతి): హైడ్రా కొందరు ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 16 మందికి ఉద్యోగ అవ కాశం కల్పించి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించింది. ట్రాన్స్ ఉమెన్స్ 11, ట్రాన్స్‌మెన్స్ ఐదుగురితో ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ ఆక్రమణల తొలగింపులో కీలక పాత్ర పోషిష్తోంది. హైడ్రాలో దక్కిన ఉద్యో గం.. మా జీవితాలకు కొత్త వెలుగు, సమాజంలో గుర్తింపు లభిస్తోదని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

ప్రభుత్వ భూముల పరిరక్షణలో చురుకైన పాత్ర

హైడ్రా ఈగల్ టీం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో చురుగ్గా వ్యవహరిస్తోంది. చెరువులు, కుంటలు, నాళాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వదలిపెట్టడం లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో ట్రాన్స్‌జెండర్లు చురుగ్గా వ్యవహరించారు.

మాదాపూర్‌లోని ఈదులకుంట కాపాడడంలోనూ వీరిదే ప్రత్యేక పాత్ర. ఆయా ఘటనల్లో జనానికి నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పడం, అధికారులు, ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి విషయాల్లో కీలక భూమిక పోషించారు. 

డబ్బుకంటే గౌరవమే ముఖ్యం : గాయత్రి

మాకు డబ్బుకంటే గౌరవమే ముఖ్యం. యూనిఫాం వేసుకుని బయటికి వెళ్తే గౌరవంగా ఉంది. ఇది మా జీవితాల్లో పెద్ద మార్పు. ప్రభుత్వం అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాం. హైడ్రాలో ఉద్యోగాలిచ్చిన సీఎంకు, హైడ్రా కమిషనర్‌కు ధన్యవాదాలు. 

గుర్తింపు లభిస్తుంది: రుచిత

పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. హైడ్రాలో పని చేయడం వల్ల మాకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.  

ఎగతాళి చేసేవాళ్లు : తాన్షీరామ్

ట్రాన్స్‌జెండర్లు అంటే ఎగతాళి చేసేవారు. పని అడిగితే తిరస్కరించేవారు. ఇప్పుడు అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు. హైడ్రాలో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతో మాకు గుర్తింపు వస్తుంది.