calender_icon.png 6 November, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు ముస్లింల ఇజ్జతే ముఖ్యం

06-11-2025 12:00:00 AM

  1. హిందువుల గౌరవం, ఆత్మగౌరవాన్ని పట్టించుకోదు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ది కుటుంబ, అవినీతి పాలన

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి ముస్లింల ‘ఇజ్జత్’ మాత్రమే ముఖ్యమని, హిందువుల గౌరవం, ఆత్మగౌరవాన్ని పట్టించుకోదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బోరబండలో భారీ బైక్ ర్యాలీ, యూ సఫ్‌గూడ డివిజన్ పరిధిలోని వెంకటగిరిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్, తెలంగాణ భవిష్యత్‌ను మార్చే ఎన్నికలని అభివర్ణించారు.

కుటుంబాన్ని బంగారం చేసుకున్న కేసీఆర్

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘తెలంగాణ కోసం బీజేపీ పోరాడితే, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ప్రజలను బానిసలుగా చూశారు. రాష్ట్రాన్ని బంగారం చేస్తానని చెప్పి, తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాలతో ఉద్యోగాలు వస్తాయని ఆశి స్తే, కేసీఆర్ మాత్రం తన ఇంట్లోనే అన్ని ఉద్యోగాలు ఇచ్చుకున్నారు’అని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని పదేళ్లపాటు మోసం చేసిన కేసీఆర్ కుటుంబం, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు కట్టుకుని ప్రజలను వంచించిందని ఆరోపించారు.

కాంగ్రెస్ బూటకపు పాలన..

బీఆర్‌ఎస్‌ను ఓడించి ప్రజలు మార్పు కోరుకుంటే, కాంగ్రెస్ రూపంలో మరో వం చన ఎదురైందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘జెండా మారింది, ముఖ్యమంత్రి మారాడు కానీ, తెలంగాణ ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాం టి మార్పూ రాలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, కాంగ్రెస్ ఒక్క హామీనైనా నెరవేర్చిందా?’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.2,500 ఎక్కడ? తులం బంగారం, పావలా వడ్డీ హామీ ఏమైంది? విద్యార్థులకు ఉచిత స్కూటీలు, నిరుద్యోగ యువతకు రూ.4,000 భృతి, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, దళితులకు రూ.12 లక్షలు.. ఇవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు.

మజ్లిస్‌ను భుజాన మోస్తున్న రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీని భుజాన వేసుకుని తిరుగుతూ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఎర్రగడ్డలో కబ్రస్తాన్ కోసం స్థలం ఇవ్వాలని చూశారు, కానీ బంజారాహిల్స్‌లో 50 గజాల్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడిని కూల్చేశారు.

ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? హిందువులపై దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మజ్లిస్ కొమ్ము కాస్తుంది. ఆ మజ్లిస్ నేతలు నేడు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం సిగ్గుచేటు’ అని విమర్శించారు.

అభివృద్ధికి బీజేపీనే భరోసా...

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఆయ నకు దేశంలోని బిడ్డలందరూ సమానమేనని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ రేవంత్‌రెడ్డి, రాహు ల్ గాంధీ వంటి నేతలు భారత సైనికులను అవమానిస్తూ పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. దేశ భద్రతను, సైనికుల గౌరవాన్ని పట్టించుకోని పార్టీలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు.

డబ్బులు పంచి ఓట్లు కొనాలని చూస్తున్నారని, కానీ జూబ్లీహిల్స్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమని, నిజమైన మార్పు కోసం, ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీకి ఓటు వేయాలని కోరారు.