12 April, 2026 | 5:47 PM

అధినేత యాత్రపైనే అభ్యర్థుల ఆశలు

09-05-2024 12:58 AM

కేసీఆర్ బస్సుయాత్రతో పెరిగిన ప్రజాదరణ

ఐదారు సీట్లలో గెలుస్తామని బీఆర్‌ఎస్ ధీమా

గెలుపును చాలెంజ్‌గా తీసుకుంటున్న శ్రేణులు

పార్టీ హయాంలో చేపట్టిన పథకాలపై ఓటర్లకు వివరణ

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడువు సమీపిస్తుండటంతో బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం ఊరు, వాడ కలియ తిరుగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేలా ఓటర్లు సహకరించాలని దండాలు పెడుతున్నారు. ప్రధానంగా పార్టీ చీఫ్ కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర తమ గెలుపునకు దోహదపడుతుందని బీఆర్‌ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు. అభ్యర్థులు చేస్తున్న ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు అయితే, కేసీఆర్ నిర్వహిస్తున్న రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లు గెలుపునకు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని పేర్కొంటున్నారు. గులాబీ అధినేత కేసీఆర్ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 5 రిజర్వ్‌డ్ స్థానాలు కాగా, 12 జనరల్ సీట్లలో.. ఆరుగురు బీజే, ఆరుగురు ఓసీలకు అభ్యర్థులు గా అవకాశం కల్పించి నామినేషన్లు ప్రారంభమైన మరుసటి రోజు బీపామ్‌తోపాటు ఎన్నికల ఖర్చు కోసం రూ.95 లక్షల చెక్కులు అందజేశారు.

అప్పటి నుంచి అభ్యర్థులు ప్రచారంలో పరుగులు పెడుతున్నా రు. అభ్యర్థుల విజయం కోసం కేసీఆర్ ముందుగా ఉమ్మడి జిల్లాకు రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావించి ముందుగా చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించారు. ఈ సభలకు జనంపెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నదని అంచనా వేసిన ఆ పార్టీ సీనియర్లు ప్రచారం ఉదృత్తం చేయాలని ప్రణాళికలు వేశారు. గులాబీ బాస్ కేసీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నదని భావించారు. ఏప్రిల్ 22న మిర్యాలగూడ నుంచి ప్రారంభించి మే 10 (17 రోజులపాటు) వరకు నిర్వహించేందుకు రోడ్‌షోలకు ఏర్పాట్లు చేశారు.

మొదటి రోజు కేసీఆర్ రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో, యాత్రకు వెళ్తూ మధ్యమధ్యలో రైతులు, కూలీలతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దీంతో అధినేతకు ప్రజల కష్టాలు తెలియడంతో కార్నర్ మీటింగ్‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాదరణ ఇంకా రెట్టింపు అయ్యింది. దీంతో పలువురు అభ్యర్థులు ఈసారి తమదే విజయమని ధీమాలో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటికి రెండు సీట్లు గెలవడం కష్టమని గులాబీ నాయకత్వం.. కేసీఆర్ బస్సుయాత్రతో ఐదారు సీట్లు సునాయాసంగా గెలుస్తామని పేర్కొంటున్నారు. 

చాలెంజ్‌గా తీసుకుంటున్న గ్రామస్థాయి నేతలు

బీఆర్‌ఎస్ గ్రామస్థాయి నేతలు తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపును చాలెంజ్ తీసుకుని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, పింఛన్లు, రైతుభీమా , మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు.