రాజకీయ ‘రాతి’ గుండెలు
ఓటర్లయితే ఓదార్పు.. వలస కూలీలైతే నిట్టూర్పు!
చేవెళ్ల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ‘అన్నపురాసులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట‘ అని ప్రజాకవి కాలోజీ నాడు పాలక వర్గాల పోకడలను ప్రశ్నించారు. నేడు చేవెళ్ల గడ్డపై జరుగుతున్న రాజకీయ క్రీడ చూస్తుంటే ఆ మాటలు అక్షర సత్యాలనిపిస్తున్నాయి. ప్రాణం ఏదైనా ఒకటే.. కానీ మన నాయకుల దృష్టిలో మాత్రం ’ఓటు’ ఉన్న ప్రాణానికే విలువ అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. శంకర్ పల్లి మండలం మహాలింగపురంలో జరిగిన ఘోర ప్రమాదం నాయకుల నైతికతను నిలదీస్తోంది.
పొట్టకూటి కోసం వచ్చి.. మట్టిలో కలిసిపోయి!
బతుకుదెరువు కోసం వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన ఐదుగురు వలస కార్మికులు ఎన్.సి.సి (NCC) కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాలిలో కలిసిపోయారు. గ్యాంట్రి క్రేన్ కుప్పకూలి వారి ఆశలను అణచివేసింది. మరో 12 మంది ఆసుపత్రి పడకలపై చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. వారి చెమట చుక్కల నెత్తుటి గాధ ఇక్కడి రాజకీయ నాయకులకు వినిపించడం లేదా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పుడు ’హడావుడి’.. ఇప్పుడు ’మౌనం’.. ఎందుకీ వివక్ష?
గత ఏడాది నవంబర్ 3న ఇదే నియోజకవర్గంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోతే, రాష్ట్రవ్యాప్తంగా నాయకులందరూ క్యూ కట్టారు. ఎందుకంటే అక్కడ మరణించిన వారు ’స్థానిక ఓటర్లు’. కానీ నేడు మరణించిన వారు ’వలసవాదులు’ కావడమే వారు చేసిన పాపమా?
స్థానిక ఎమ్మెల్యే యాదయ్య, మంత్రి వివేక్ మినహా.. మిగిలిన ఉద్దండ పిండాలందరూ ఎటు పోయారు?..... ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి హేమాహేమీలకు ఈ ఆర్తనాదాలు చేరలేదా?
నా ఊరు.. నా జిల్లా అని గొప్పలు చెప్పుకునే నేతలు, పక్కనే ఉన్న శంకర్ పల్లి వైపు కన్నెత్తి చూడకపోవడం దేనికి సంకేతం?
మనుషులు కాదు.. ’లోకల్ - నాన్ లోకల్’ ఓటర్లే కనిపిస్తున్నారు!
రాజకీయ నాయకులు మనిషిని మనిషిగా చూడటం మానేశారు. వారి కళ్లకు మనుషులు కేవలం ’లోకల్’ మరియు ’నాన్ లోకల్’ ఓటర్లుగానే కనిపిస్తున్నారు. ఓటు వేసే హక్కు ఉంటేనే పరామర్శలు, లేకపోతే పట్టింపులేని తనమా?
‘నర్రెంగ సెట్టు కింద నరుడో భాస్కరుడా..‘ అంటూ శివసాగర్ రాసిన పాటను గుర్తుచేసుకుంటూ, ప్రజల్లో చైతన్యం రావాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలు పెరిగినప్పుడే ఈ ’రాజకీయ రాతి గుండెల’లో చలనం వస్తుంది.
ఎటు పోతోంది సమాజం?
పదవులు అనుభవించేది ప్రజల ఓట్లతోనే అయినప్పుడు, ఆ గడ్డపై ప్రాణాలు వదిలిన ఏ మనిషికైనా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. వలస కార్మికుల ప్రాణాలకు విలువ లేని చోట, మానవత్వానికి అర్థం ఎక్కడుంది? ఈ వివక్షపూరిత రాజకీయాలపై సమాజం నేడు నిలదీస్తోంది.






