12 May, 2026 | 2:27 AM

ప్రమాదాలే నిత్యం.. రక్షణ చర్యలు శూన్యం..!

12-05-2026 12:58 AM

ప్రమాదాలకు అడ్డగా  హైదరాబాద్ విజయవాడ రహదారి 

కనిష్టంగా రెండు రోజులకో ప్రమాదం 

రోడ్డు విస్తరణ కారణంగా మరిన్ని ప్రమాదాలు 

త్వరితగతిన రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని ప్రజల వేడుకోలు

చౌటుప్పల్, మే 11: హైదరాబాద్ - విజయవాడ రహదారి నిత్యం ప్రమాదాలకు కేంద్రంగా మారింది. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట్ దగ్గరనుండి పంతంగి టోల్ గేట్ వరకు ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగంగా వాహనాలను నడపడం ఒక కారణమైతే అడ్డగోలుగా నిర్మితమైన రోడ్డు మరో కారణంగా నిలుస్తుంది. పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేట్ ట్రావెల్స్ అతివేగం వలన తరచుగా ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రమాదాలు జరిగే ప్రాంతాలివే..:

అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో 65వ జాతీయ రహదారి ఒకటి.ఈ రహదారి అటు ఆంధ్రాకు ఇటు నల్లగొండలోని పలు ప్రాంతాలకు వెళ్లడానికి ప్రధాన మార్గం.పది సంవత్సరాల క్రితం నిర్మించిన నాలుగు లైన్ల రహదారిపై అండర్ పాస్ నిర్మించక పోవడంతో పలు గ్రామాలకు వెళ్ళే దగ్గర నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా మండలంలోని మల్కాపురం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం వద్ద తరచుగా ప్రమాదాలు జరిగి వేలాది మంది మరణించారు. గతంలో కొయ్యలగూడెం,లింగోజీగూడెం వద్ద మాత్రమే బ్రిడ్జితో కూడిన నిర్మాణం ఏర్పాటు చేశారు. కానీ అత్యధికంగా ప్రమాదాలు జరిగి బ్లాక్ స్పాట్ గా నిలిచిన చౌటుప్పల్, ధర్మోజిగూడెం వద్ద ఎలాంటి అండర్ పాస్ గానీ, నిర్మించలేదు. దీంతో గ్రామాలకు వెళ్ళే వారు అత్యధిక వేగంతో జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదాలు సంభవించాయి.

పోలీసుల చర్యలు:

ప్రమాదాల నివారణకు చౌటుప్పల్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణ ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.టోల్ గేట్ వద్ద నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా పెట్రోలింగ్ పోలీసులు రహదారిపై నిత్యం సంచరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ మద్యంబాబులు తాగి వాహనాలు నడపకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అతివేగమే కారణం :

ప్రతిరోజూ జరిగే ప్రమాదాలకు దాదాపుగా అతివేగంతో జరిగే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ తెలిపారు. సరదా కోసం వాహనాలు నడిపే యువకులు ఓవర్ స్పీడ్ తో నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు.ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి నియంత్రణ కోల్పోయి వాహనాలకు ఢీకొట్టడం పక్కవారి ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తున్నారు.

విస్తరణ పనులతో  పెరిగిన ట్రాఫిక్...

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రమాదాలు తరచుగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్ గా గుర్తించి అండర్ పాస్ నిర్మాణాలను చేపట్టారు. దీంతో ఒకవైపు మూసివేసి వాహనాలను ఒకవైపునుండే అనుమతిస్తున్నారు. దీంతో రద్దీ అధికమై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరితగతిన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తరచుగా జరిగే ప్రమాదాలకు అతివేగమే కారణం: - ట్రాఫిక్ సి ఐ విజయ్ మోహన్ 

‘మండలంలో తరచుగా సంభవించే ప్రమాదాలలో దాదాపు అతివేగం వల్ల జరిగినవే..జాతీయ రహదారిపై నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రమాదాలను నియంత్రిస్తున్నాం.అత్యంత ప్రమాదకర ప్రాంతాలలో 24 గంటల పర్యవేక్షణ ఏర్పాటు చేశాం.యువత తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు.

రోడ్డు విస్తరణ త్వరగా పూర్తి చేయాలి

రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. వాహనాలు రెండు కిలోమీటర్లు ముందుకువెళ్లి తిరగాల్సి వస్తుంది.రోడ్డు విస్తరణ పనులు జరిగే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలి.

- వెల్జాల అశోక్, పంతంగి గ్రామం