09-02-2026 12:13:52 AM
ఉన్నట్టుండి నడమంత్రపు సిరివస్తే మనుషుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి..అనే అంశం చుట్టూ ఆసక్తికర కథనం అల్లారు కన్నడ రచయిత వివేక్ శాన బాగ. ఒక సామాన్య కుటుంబం ఆస్తి పరులు గా ఎలా మారిందనే తీరును రచయిత అద్భు తంగా నవలలో చిత్రించారు. కేవలం వంద పేజీల్లో రాసిన ఈ నవల కన్నడలో సంచలనం సృష్టించింది. ఇదే ఒరవడిలో ఇతర భా షల్లోకీ అనువాదమైంది. నవలను తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు అనువదిం చారు.
బెంగళూరులోని ఒక కాఫీ హౌస్‌లో కూర్చొని కథకుడు తన గతాన్ని తలుచుకోవడంతో నవల మొదలవుతుంది. కథానాయకు డు తన కుటుంబంతో కలిసి ఒకప్పుడు నాలు గు గదుల చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆ పాతబడిన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి మెలిసి ఉండేవారు. తండ్రి సేల్స్‌మేన్‌గా సం పాదించే కొద్దిపాటి ఆదాయంతోనే వారి కు టుంబం గడిచేది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితులు ఎదురై తండ్రి ఉద్యోగం పోతుం ది. అప్పుడు తన సోదరుడు చిక్కప్ప సలహా తో ’సోనా మసాలా’ అనే వ్యాపారాన్ని ప్రా రంభిస్తాడు.
వ్యాపారం విజయవంతం కావడంతో వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. వారు తమ పాత ఇంటిని వదిలి విలా సవంతమైన బంగళాలోకి మారతారు. ఈ క్రమంలో ఐశ్వర్యం ఆ కుటుంబ మనస్తత్వా న్నీ మార్చేస్తుంది. డబ్బు అనేది మానవ సం బంధాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఈ నవలకు మూలవస్తువు. ‘డబ్బును అదుపులో ఉంచేది మనం కాదు.. డబ్బే మనల్ని నియంత్రిస్తుంది’ అనే కటువైన సత్యాన్ని రచయిత ప్రతి పాత్ర ద్వారా పాఠకులకు వివరిం చారు.
పేదరికంలో ఉన్న సమయంలో ఒక్కటిగా ఉన్న కుటుంబం, కోటీశ్వరులయ్యాక ఎవరి గదులకు వారు పరిమితమవుతారు. కుటుంబంలో క్రమంగా తండ్రి గౌరవం తగ్గుతుంది. బాబాయ్ చిక్కప్ప పెత్తనం మొదలవు తుంది. ఆయన మాటకే ఇంట్లో విలువ పెరుగుతుంది. కథానాయకుడు ఏ పనీ చేయకుం డా, విలాసాలకు అలవాటు పడతాడు. అతని భార్య అనిత ఆ మార్పులను గమనించి కథానాయకుడిని ప్రశ్నిస్తుంది.
ఈ క్రమంలో ఆ కు టుంబంలోని చీకటి కోణాలు, అనైతిక విలువలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. సాధా రణంగా విడదీయలేని చిక్కుముడిని ‘ఘోచర్ ఘాచర్’ అంటాం. ఇవే చిక్కుముడులను తన నవల ద్వారా వివరించారు వివేక్. నవల ద్వారా రచయిత ఒక కుటుంబానికి కేవలం ఆర్థిక భద్రత ఉంటే సరిపోదని, సంస్కారం, నైతికతలు కూడా ఉండాలని అన్యాపథంగా చెప్తుంది. ఈ నవలను రంగనాథ రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు.
తెలుగు పాఠకులకు నవలను దగ్గర చేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు. పడిగట్టు పదాలు వాడకుండా, ఎక్కడా గ్రాంథిక వాసనలు లేకుండా అచ్చ తెలుగులో తెలుగు అను వాదం సాగింది. మూలకథలోని ఆత్మను దెబ్బతీయకుండా సరళమైన భాషతో అనువదించి ఆయన పూర్తి విజయం సాధించారు. ఇక వివేక్ శానబాగ విషయానికొస్తే.. కన్నడ సాహిత్య రంగంలో ఆయనకు మంచి పేరుంది.
కేవలం రచయిత గానే కాకుండా, ఆయనకు సంపాదకుడిగానూ గుర్తింపు ఉం ది. ఆయన స్వస్థలం కర్ణాటకలోని సిర్సి. ఆయన రచనలు చాలా వరకు మధ్యతరగతి జీవితాల చుట్టూనే తిరుగుతాయి. మనుషుల మధ్య ఉండే సున్నితమైన వైరుధ్యాలను ఆయన తన కథల్లో ఎంతో నిశితంగా చూపిస్తారు. ఈ తరహా రచనలు చదివేవారికి ‘ఘోచర్ ఘాచర్’ నవల ఒక మంచి రచన.
లిఖిత
ప్రతులకు: ఛాయ పబ్లికేషన్స్