21-02-2026 01:34:29 AM
విద్యాశాఖలో అధికారుల కొరత
పాఠశాలల పర్యవేక్షణ కరువు
ఎంఈవో పోస్టుల్లో కూడా అదే తీరు
పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది 15 మందే..
విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం
కొత్తగా మంజూరు కాని పోస్టులు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పాఠశాల విద్యాశా ఖలో అధికారుల కొరత వేధిస్తోంది. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వర కూ సరిపడా అధికారులే లేని పరిస్థితి. కొన్నేళ్లుగా పాఠశాల విద్యాశాఖలో ఇదే పరిస్థితి ఉంది. జిల్లా విద్యాధికారి నుంచి కిందిస్థాయి డిప్యూటీ డీఈవోలు, ఎంఈ వో పోస్టుల వరకు ఇన్‌చార్జులే కొనసాగుతున్నారు. దీంతో పాఠశాలలను పర్య వేశించే అధికారులు కరువయ్యారు. రాష్ర్టంలో 33 జిల్లాలుంటే దాంట్లో కేవ లం ఇద్దరు ముగ్గురు మాత్రమే రెగ్యులర్ డీఈఓలు ఉండడం గమనార్హం.
పైనుంచి కింది స్థాయి వరకు ఇన్‌చార్జుల పాలనే ఉండడంతో దాని ప్రభావం విద్యాప్రమాణాలపై పడుతోంది. దీనికి తోడూ హెచ్‌ఎంలు, అధికారులపై పని భారం తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలో మొత్తం 39,366 పాఠశాలలుండగా వీటిలో 59,08,464 మంది (ఇంటర్ వరకు) మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలోనూ 3,30,651 మంది ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది మళ్లీ వేరే. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు జిల్లాల్లో డీఈఓలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓలు కీలకంగా వ్యవహరిస్తారు.
33 జిల్లాలకు 12 డీఈవో పోస్టులే..
10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన సౌలభ్యం, పారదర్శకమైన పాలన కోసం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచింది. మొదటి దశలో 31 నూతన జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా విభజించారు.
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో2020 నారాయణపేట, ములుగు జిల్లాలలతో పాటు మరికొన్ని మండలాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 33 జిలాలు, 74 రెవెన్యూ డివిజన్లు, దాదాపు 626 మండలాలు ఉన్నాయి. అయితే 33 జిల్లాలకు కేవలం 12 డీఈవో పోస్టులే ప్రస్తుతం ఉన్నా యి. ఇందులో కూడా దాదాపు ముగ్గురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు పనిచేస్తున్నారు.
అంటే దాదాపు 30 జిల్లాల్లో ఇన్‌చా ర్జులే పాలనచేస్తున్నారు. ఈ పోస్టుల్లో డైట్‌కాలేజీల డిప్యూటీ ఈవోలు, లెక్చరర్లు, ప్రిన్సి పాళ్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు ఇన్‌చార్జులుగా ఉంటున్నారు. 24 వరకు డిప్యూటీ ఈవో పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.
15 మండలాలకే రెగ్యులర్ ఎంఈవోలు..
రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక ఎంఈఓ ఉండాలి. కానీ చాలా చోట్ల ఇన్‌చార్జులే ఉన్నారు. రాష్ట్రంలో 626 మండలాలు ఉండగా, వాటిలో కేవలం 15 మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నారు. పాత మంజూరైన ఎంఈవో పోస్టులు 476 కాగా, మరో 85 పోస్టులను సాక్షన్ చేయాలని అనుకున్నారు కానీ, అదీ జరగలేదు. 15 మండలాలకు మినహా అన్ని చోట్ల హెచ్‌ఎంలే ఇన్‌చార్జ్ ఎంఈవోలుగా ఉన్నారు. కొత్త మండలాలకు పోస్టులనే ఇంత వరకూ మంజూరు చేయలేదు. సాంకేతిక, సర్వీస్ రూల్స్‌లాంటి సమస్యలను సాకుగా చూపి డీఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయడంలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
హెచ్‌ఎంలకే ఈ బాధ్యతలను అప్పగించడంతో అటు స్కూల్ బాధ్యతలు, ఇటు మండల కేంద్రం అదనపు బాధ్యతలతో సతమతవుతున్నారు. పనిభారం ఎక్కువగా అవుతోంది. దీని ప్రభావం క్రమంగా స్కూల్‌పైన పడుతోంది. కొత్త పోస్టులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు పంపించినా ఫలితం లేకుం డా పోయింది.
కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాలకు ఇతర శాఖలకు సంబంధించిన పోస్టులు ఎప్పుడో మంజూరయ్యాయి.. కానీ విద్యాశాఖలో మాత్రం డీఈవో, ఎంఈ వో పోస్టులు మంజూరే కాలేదు. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాగానీ కొత్త పోస్టులకు మాత్రం మోక్షం లభించడంలేదనే విమర్శలు టీచర్, విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.