నవజాత శిశువును ఎండలో వదిలేసిన వైనం
కన్న తల్లి వదిలేసినా... అక్కున చేర్చుకుంది మదీనా కాలనీ
బాన్సువాడ, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలోని ఓ మూలకున్న నిర్మానుష్య ప్రదేశంలో గురువారం మండుట ఎండల్లో పట్టపగలు అప్పుడే పుట్టిన నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన ఘటన చోటుచేసుకుంది. మదిన కాలనీ లోని ఓ నిర్మానుష ప్రదేశం నుండి చిన్నగా ఏడుపు వినిపించింది ఎవరో పసికందు గొంతు ఆ ఏడుపు విన్న పక్కింటి మహిళ పరుగున వెళ్లి చూసింది గుడ్డల్లో చుట్టి వదిలేసిన నవజాత మగ శిశువు బొడ్డు కూడా సరిగ్గా తీయలేదు.
కొన్ని గంటల క్రితమే పుట్టి ఉంటాడనీ కాలనీ వాసులు సకాలంలో స్పందించడంతో శిశువు ప్రాణాలు కాపాడారు.నా కొడుకు వయసే చూడగానే గుండె తరుక్కుపోయింది అంటూ కళ్లు చెమర్చాయి ఆ మహిళకు వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచింది.నిమిషాల్లోనే కాలనీ మొత్తం అక్కడ గుమ్మి గుడింది. వెంటనే పోలీసులకు కాలనీవాసులు సమాచారం ఇచ్చారు.ఎండలో అలా పడేసిపోతే ఏమైపోయేవాడో. పాపం, తల్లి ఎలా మనసొప్పిందో అంటూ కొందరు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
పోలీసులు వచ్చే వరకు కాలనీ మహిళలంతా ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడారు. చేతులు మారుస్తూ, లాలిస్తూ, జోల పాడుతూ ఓదార్చారు.బాన్సువాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిశువును వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.తల్లి వదిలేసినా, కాలనీ వాసులు తల్లులైంది ఆ బిడ్డకు అని స్థానికులు అన్నారు. ప్రస్తుతం శిశువును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.ఎవరు కన్నారో తెలియదు. ఎందుకు వదిలేశారో తెలియదు. కానీ ఆ ఒక్క ఏడుపు విని మదీనా కాలనీ మొత్తం తల్లిగా మారిన మానవత్వం మాత్రం అందరి మనసును కదిలించింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






