6 June, 2026 | 1:46 AM

ఆహార కల్తీపై చర్చించే ఇండియా స్టోరీ

06-06-2026 12:01 AM

కాజల్ అగర్వాల్ నిరుడు ‘కన్నప్ప’లో అతిథి పాత్ర లో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇటీవల హిందీలో విడుదలైన ‘సికిందర్’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో కనిపించిందీ టాలీవుడ్ చందమామ. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది కాజల్. ఆ సినిమానే ‘ది ఇండియా స్టోరీ’. కాజల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపిం చనుంది.

సాగర్ బి షిండే నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ విడుదల చేస్తోంది. జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. సమాజాన్ని ఆలోచింపజేసే ఎన్నో షాకింగ్ నిజాలను ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయంలో వాడుతున్న రసాయనాలు, పెస్టిసైడ్ కంపెనీల అక్రమాలు, ఆహార కల్తీ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ కాన్సెప్ట్ టీజర్ ఆలోచింపజేసేలా ఉంది.

ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న అతిపెద్ద సంక్షోభాన్ని హైలైట్ చేస్తూ, వ్యవస్థలోని లోపాలు, కఠిన నియంత్రణల అవసరాన్ని సినిమా ప్రస్తావించబోతున్నట్టు స్పష్టం చేస్తోందీ టీజర్. ముఖ్యంగా పిల్లలు తాగే పాలు, ఆహార పదార్థాలు, రసాయనాలతో పండించిన పండ్లు, చికెన్, కూరగాయలు వంటి నిత్యావసరాలను కల్తీ చేస్తున్న తీరును చూపించి, ఆసక్తి రేకెత్తించారు.

ఈ కల్తీ ఆహారం కారణంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. టీజర్‌లో ప్రస్తావించిన గణాంకాలు కూడా ఈ సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.