11 August, 2026 | 1:50 AM

ఇందిరమ్మ ఇల్లు నిజమైన లబ్ధిదారునికే అందాలి

11-08-2026 12:08 AM

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

పెంట్లవెల్లి, ఆగస్టు 10 (విజయక్రాంతి): మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు. అనంతరం చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లు అర్హులైన నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. నూతన కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

గోప్లాపూర్ గ్రామంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 50 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించామని, ఇప్పటికే 22 ఇళ్లకు మంజూరు ఇచ్చామని మంత్రి తెలిపారు. మిగిలిన 28 ఇళ్లను కూడా త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు గోపి నాయక్, చిన్నంబావి మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ గోవింద్గౌడ్, రామన్గౌడ్, బీచుపల్లి యాదవ్, కొప్పునూరు సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.