16-07-2025 11:51:10 PM
రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గిరిజన పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకులను నియమించకపోవడంతో ఆయా పాఠశాలలు, కళాశాలల్లో బోధన అటకెక్కింది. దీంతో ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న గిరిజనులకు సరైన విద్య అందడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా సదుపాయాలు కల్పిస్తూ కాలం వెల్లదీస్తోంది. కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా బెస్ట్ అవైలబు ల్ స్కూళ్లలో విద్యనభ్యసించే వెనుకబడిన వర్గాల వారూ ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.
దళిత, గిరిజన పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించేందుకు 1990లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్)ను ప్రవేశపెట్టారు. ఈ పథకానికి సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీంతో ఆ పాఠశాలల్లో చదివేవారు, కొత్తగా ఆ పాఠశాలలకు ఎంపికైన వారు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలు కొత్తగా ఈపథకానికి ఎన్నికైన విద్యార్థులను స్కూళ్లలోకి అనుమతించడం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఎంతో మంది ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నా సర్కార్ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునేం దుకు లక్షలాది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నా, అక్కడ సీట్ల కొరత ఉంది. కేవలం 35 వేలమందికే అందులో చదువే అవకాశం దక్కుతోంది. ఇలాంటి తరుణంలో ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందించేందుకు ఆనాటి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.. ఈ పథకం వల్ల వేలాదిమంది దళిత, గిరిజన పేద విద్యార్థులు ఉన్నత చదువులు చ దివి ఉద్యోగాలు పొందుతున్నారు.
మంత్రి హామీ ఇచ్చినా..
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్) పెండింగ్ బకాయిల విడుదలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రైవేట్ పాఠశాలలు, విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అయినా ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదు. రెండ్రోజుల్లో పెండింగ్ నిధులను ఖాతాల్లో జమ చేస్తామని ఈనెల 1వ తేదీన మీడియా సమావేశంలో మంత్రి హామీ ఇచ్చారు. 15 రోజులవుతున్నా ఇంతవర కూ తమ ఖాతాల్లో నిధులు జమకాలేదని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.
మూడేళ్లుగా బకాయిలు ఉండ టంతో విద్యార్థులను చేర్పించుకునేందుకు యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. జూలై వచ్చినా తమ పిల్లలు ఇంటివద్దనే ఉండటంతో చేసేదేమీ లేక కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు కట్టి వేరే పాఠశాలలకు పంపిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆదేశాలతో ఆయా పాఠశాలలు మాత్రం విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి ఈ స్కీం కింద అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం నీరుగారిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్)ను అమలు చేసే స్కూళ్లకు, ఇటు ఆయా స్కూళ్లలో చదువుతున్న, ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు తీసుకోబోయే వి ద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట లభించట్లే దు. చాలా రోజుల నిరీక్షణ అనంతరం ప్రభుత్వం ఎట్టకేలకు బెస్ట్ అవైలబుల్ స్కూ ల్ స్కీం పెండింగ్ బకాయిలను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించినా.. అది ఫలించలేదు. దీంతో విద్యార్థులు ఇంటికే పరిమి తమయ్యారు.
మూడేండ్ల నుంచి పెండింగే...
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 పాఠశాలల్లో బీఏఎస్ స్కీం అమలవుతోంది. జిల్లా కు 5 నుంచి 10 పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో జిల్లాల్లో 500 నుంచి 1000 వరకు ఈ స్కీం కింద అడ్మిషన్లు నమోదవుతున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీం కింద 25 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు 18 వేలు, ఎస్టీలకు 7 వేల సీట్లు ఉంటాయి.
ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి సీటు కేటాయిస్తారు. స్కూళ్లలో సీటు పొందిన విద్యార్థులకు ఉచితంగా డేస్కాలర్స్, రెసిడెన్షియల్ విద్యనందిస్తారు. ఎస్సీ విద్యార్థులకు ఒకటో తరగతిలో, 5వ తరగతిలో ప్రవేశాలుంటే, ఎస్టీ విద్యార్థులకు మూడు, ఐదు, ఎనిమిదో తరగతిలో ప్రవేశాలుంటాయి.
వీరు పదో తరగతి వరకు ఉచితంగానే చదువుకుంటారు. ఇందుకుగా నూ హాస్టల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.42 వేలు, డేస్కాలర్ విద్యార్థికి రూ. 28 వేలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ స్కీం కింద చేరే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు, కాస్మోటిక్స్, భోజనాన్ని పాఠశాలల యాజమాన్యాలు అందించాల్సి ఉంటుంది.
వీటికి సంబంధించిన బకాయిలు మూడేళ్లుగా పెండింగ్ లోనే ఉండడంతో బకాయిలు చెల్లిస్తేనే అ డ్మిషన్లు చేపడతామని యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరగగా.. వాటిని క్లియర్ చేస్తున్నట్టు ప్రకటించింది. స్కీంకు మోక్షం లభించలేదు.
పాపం గిరిజనులు..
గిరిజన గురుకుల విద్యాసంస్థలో మిగిలిపోయిన సీట్లను త్వరగా భర్తీ చేసేందుకు గిరిజన గురుకుల సంస్థకు అనుమతి ఇవ్వాలని, రూ.154 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలని, అంబేద్కర్ విద్యా నిధి పథకం కింద విదేశీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల లిస్టును తక్షణం ఆమోదించాలని కోరుతూ ఇటీ వల పలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
అయినా నేటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంకో విద్యా ర్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగ హక్కులు కలిగిన గిరిజన గురుకుల విద్యాసంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మారు స్తున్న సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి వ్యవహార శైలిని కట్టడి చేయాలని కోరారు.
గురుకుల సెట్ కన్వీనర్‌గా వ్యవహరించిన అలుగు వర్షిణి అనం తరం రాష్ర్టవ్యాప్తంగా గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో మిగిలిపోయిన వేలాది సీట్లను భర్తీ చేసుకోవడానికి గిరిజన గురుకుల విద్యాసంస్థకు బదిలీ చేయకపోవడం ఆమె ఆధిపత్య ధోరణికి నిదర్శనమని, దాన్ని తగ్గించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. అలాగే గురుకులాల్లో సీట్లు రానివారు, పరీక్ష రాయని వారు వందలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గిరిజన గురుకుల సంస్థకు వచ్చి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తక్షణం జోక్యం చేసుకొని మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసుకోవడానికి గిరిజన గురుకుల సంస్థకు అధికారాలు ఇవ్వాలని కోరారు.
బకాయిలు విడుదల చేయాలి
రాష్ర్ట ప్రభుత్వం బకాయిపడ్డ రూ. 154 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్)నిధులను విడుదల చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇచ్చిన హామీపై తక్షణమే చొరవ తీసుకుని పరిష్కారం చూపాలి. అలాగే విదేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో ఉన్న త విద్యనభ్యసిస్తున్న దళిత, గిరిజన విద్యార్థులకు రాష్ర్ట ప్రభుత్వం అంబేద్కర్ విద్యా నిధి పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షల చొప్పున స్కాలర్‌షిప్‌లను మం జూరు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ఈ పథకం కోసం కొత్తగా విద్యార్థులను ఎంపి క చేయలేదు. మంత్రి తక్షణం జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకంలోని విద్యార్థుల లిస్టుకు త్వరగా అనుమతి వచ్చేలాగా కృషి చేయాలి.