15 April, 2026 | 3:16 AM

పర్యావరణంపై ‘ఐరన్’ పంజా..

15-04-2026 12:49 AM
  1. ఇప్పలపల్లిలో కాలుష్య కోరలు!

పగలు సెగలు.. రాత్రి పొగలు.. 

అల్లాడుతున్న పల్లెలు

మళ్ళీ మొదలైన స్పాంజ్ ఐరన్ కంపెనీ.. వెనుక ఉన్న ’పెద్దలు’ ఎవరు?

షాద్నగర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామ సమీపంలోని స్పాంజ్ ఐరన్ పరిశ్రమ మళ్లీ జవసత్వాలు పుంజుకుంది. అయితే, ఆ పరిశ్రమ పునఃప్రారంభం స్థానిక ప్రజల పాలిట శాపంగా మారింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామస్తులు, తండాల ప్రజలు తమ ప్రాణాలను కాపాడాలంటూ గగ్గోలు పెడుతున్నారు.గతంలో రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించే ఈ కంపెనీ, ఇప్పుడు బరితెగించి పగలు, రాత్రి తేడా లేకుండా కార్యకలాపాలు సాగిస్తోంది.

చిమ్మే నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుంటే, రసాయన వ్యర్థాలు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తున్నాయి.రసాయన వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోవడంతో తాగే నీరు కలుషితమవుతోంది. పొలాల్లో బూడిద పేరుకుపోవడంతో పంటలు పండక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కలుషితమైన గడ్డిని మేసి, విషపూరిత నీటిని తాగి పశువులు అకాల మరణం పాలవుతున్నాయి.

రాజకీయ అండదండలు ఉన్నాయా?

ఇంత జరుగుతున్నా అధికారులు మౌనం వహించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని గ్రామస్థులు ఆరోపిస్తు న్నారు. నిబంధనలను తుంగలో తొక్కి కంపె నీ నడుపుతున్నా పట్టించుకోకపోవడం వెను క స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం కంటే తమ స్వార్థమే ముఖ్యమనుకుంటున్న నాయకుల తీరుపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.మా పిల్లలు ఊపిరి పీల్చుకోవడానికి భయపడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఈ కంపెనీ వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరో తేలాలని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల మౌనం.. విస్మయానికి గురిచేస్తోంది..

పర్యావరణ శాఖ నిబంధనలు ఇప్పలపల్లి ఐరన్ కంపెనీకి వర్తించవా? కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కళ్లు మూసుకుందా? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.కంపెనీ యాజమాన్యం తీరు మారుతుందా? లేక అధికారులు ఇప్పటికైనా నిద్ర మేల్కొంటారా? అసలు ఈ కంపెనీ ఆగడాల వెనుక ఉన్న ఆ రాజకీయ నేతలు ఎవరు?

మరింత సమాచారం ’పార్ట్-2’లో... త్వరలో మీ ముందుకు!