సీతారామతో తీరనున్న సాగునీటి సమస్య
మంత్రి తుమ్మల
ములకలపల్లి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగానికి సాగునీటి సమస్య ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, కో-ఆపరేటివ్, చేనేత అనుబంధ సంస్థల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని కమలాపురం, తొట్టిపంపు గ్రామాలలో సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలను పరిశీలించారు.
ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారుల ద్వారా వివరాలను సేకరించారు.అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గం యాతాలకుంట లిఫ్ట్ ఇరిగేషన్ కేంద్రాన్ని సందర్శించి సత్తుపల్లి ట్రంక్ కెనాల్,టన్నెల్ కాలువ పనుల ప్రస్తుత స్థితిని సమీక్షించారు. పనులు సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మండల నాయకులు పాల్గొన్నారు.






