పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ కె. హరితకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా వంటి సంక్షేమ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని అన్నారు. ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన హామీని అమలు చేయాలని కోరారు.
గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, నాలుగు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, రెండో పీఆర్సీలో గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. జీఓ నెం.51ను సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, కార్మికులకు రూ.10 లక్షల బీమా, ప్రమాద మరణాలకు రూ.20 లక్షల నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగావకా శం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల క్రిష్ణమాచారి, యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాడి మోరేశ్వర్, కార్యదర్శి పెరక శ్రీకాంత్, కోశాధికారి గుండం శంకర్, ఉపాధ్యక్షులు మోర్లే నగేశ్, సహాయ కార్యదర్శి పుష్పలత పాల్గొన్నారు.






