ఆధునిక వైద్యానికి ల్యాబోరేటరీ సేవలు వెన్నుముక వంటివి
నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్
పంజాగుట్ట, జూన్ 12 (విజయక్రాంతి): ఆధునిక వైద్యానికి ల్యాబోరేటరీ సేవలు వెన్నుముక వంటివని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. నిమ్స్ లోని బయోకెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ మెడికల్ బయోకెమిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఏఎంబీఐ) తెలంగాణ చాప్టర్ ఏడో రాష్ట్ర సదస్సు శుక్రవారం నిమ్స్ ట్రామా బ్లాక్ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన డైరెక్టర్ సదస్సును బయోకెమిస్ట్రీ విభాగాధిపతి ఎం.నూర్జహాన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోటల్ ల్యాబ్ ఆటోమేషన్ ద్వారా రోగ నిర్ధారణ పరిక్షలను కచ్చిత్వంతో నిర్వహించవచ్చన్నారు. అంతేకాకుండా సేవల నాణ్యత, వేగం గణనీయంగా మెరుగుపడతాయన్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, డేటా ఆధారిత వ్యవస్థలు ల్యాబోరేటరీ సేవల విశ్వసనీయతను పెంచుతాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎం.నూర్జహాన్ మాట్లాడుతూ ఫ్రాంటియర్స్ ఇన్ ల్యాబ్ మెడిసిన్: టోటల్ ల్యాబ్ ఆటోమేషన్ అండ్ లివర్ కేర్ అనే ప్రధాన అంశంతో రెండు రోజుల పాటు సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. తొలిరోజు అడ్వాన్సెస్ ఇన్ ల్యాబ్ ఆటోమేషన్ అంశంపై శాస్త్రీయ సమావేశాలు నిర్వహించామన్నారు.
నిర్వహించబడ్డాయి. ల్యాబ్ ఆటోమేషన్ పరిణామక్రమం, టోటల్ ల్యాబ్ ఆటోమేషన్ సూత్రాలు, అమలులో ఎదురయ్యే సవాళ్లు, డిజిటల్ ఇంటిగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వంటి అంశాలపై ప్రముఖ నిపుణులు ప్రసంగించారన్నారు. నేడు జరిగే సదస్సులో అండర్ స్టాండింగ్ ది లివర్ ఇన్ ది ల్యాబ్ అంశంపై కాలేయ వ్యాధుల నిర్ధారణలో ప్రయోగశాల పరీక్షల పాత్ర, లివర్ ఫైబ్రోసిస్ అంచనా, ఆధునిక బయోమార్కర్లు, మాలిక్యులర్ మార్కర్లు, కేస్ ఆధారిత చర్చలు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ని మ్స్ ఇన్చార్జి డీన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతి వీర్, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఎన్. శ్రీదేవి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఎస్.ఎస్. సా యిబాబా, బయోకెమిస్ట్రీ విభాగం వైద్యులు సిరాజ్ అహ్మద్ ఖాన్, ఎస్. భవ్య, జోయ్ హెఫ్జిబా, రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నుంచి వచ్చిన బయో కెమిస్ట్రీ నిపుణులు, అధ్యాపకులు, రెసిడెంట్ వైద్యులు, పరిశోధకులు పాల్గొన్నారు.






