26 August, 2026 | 4:40 PM

ప్లానింగ్‎లో వసూళ్ల కింగ్

26-08-2026 03:37 PM
  1. దుండిగల్, నిజాంపేట్ సర్కిల్‎లో రాజ్యమేళుతున్న టీపీఓ
  2. అక్రమ నిర్మాణాలపై చర్యలు నోటిసులకే పరిమితం
  3. నోటీసులు జారీ చేశాకా భారీగా సెటిల్మెంట్లు
  4. సారు జేబు నిండనిదే ఇంటికెళ్ళడు
  5. డీసీ, ఏసీపీకి కూడా వసూళ్లలో వాటా అంటూ ఆరోపణలు
  6. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

కుత్బుల్లాపూర్, ఆగష్టు 26(విజయక్రాంతి): సీఎంసీ నిజాంపేట్, దుండిగల్ సర్కిల్ లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉన్నత అధికారులు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికి టౌన్ ప్లానింగ్ యంత్రాంగం మాత్రం అవేమి పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలకు ఊపిరిపోస్తున్నారు. నిర్మాణదారులు కొంత వరకే అనుమతులు తీసుకొని బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. కొన్ని నిర్మాణాలకు అయితే అసలు అనుమతులే ఉండవు.

టౌన్ ప్లానింగ్ సిబ్బందికి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నప్పటికి నోటీసులు జారీ చేసి, నిర్మాణదారులను తమ దారిలోకి తెచ్చుకొని సెటిల్మెంట్ల్ చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. గతంలో దుండిగల్ సర్కిల్ లో టీపీఓగా విధులు చేపట్టిన సంజునపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, టీపీఓపై దర్యాప్తు చేసి సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ విద్ధుల్లో ఉన్న టీపీఓ కూడా అదే తరహాలో అక్రమ నిర్మాణదారుల నుండి లక్షల్లో లంచాలు వసూళ్లు చేస్తున్నాడని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

వసూళ్ల కింగ్ టీపీఓ ... డీసీ, ఏసీపీ లకు వాటా అంటూ ఆరోపణలు

దుండిగల్ సర్కిల్ పరిధిలోని డీసీ, ఏసీపీ, టీపీఓ లపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి.అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసుల పేరుతో నిర్మాణదారులతో సెటిల్మెంట్ల్ చేసి, అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీపీఓ అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సింది పోయి అక్రమ నిర్మాణాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నాడు. ఫ్లోర్ కు లక్షల్లో వసూళ్లు చేస్తూ అక్రమ నిర్మాణాలకు ఊపిరి పోస్తున్నాడు.ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేటు ఫిక్స్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నాడని నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండిగల్ డీసీ, ఏసీపీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, వసూళ్లలో వీళ్లకు కూడా వాటా అందుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సారు జేబు నిండనిదే ఇంటికెళ్ళడు...

సారు ఫీల్డ్ విజిట్ పేరుతో అక్రమ నిర్మాణదారుల వద్దకు వెళ్లి నిర్మాణదారులను డబ్బులు ఇవ్వకపోతే జేసీబీ పెడతానంటూ బెదిరించి లంచాలు వసూళ్లు చేస్తూ, రోజూ జేబు నిండనిదే ఇంటికెళ్ళడని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి అక్రమ నిర్మాణాలను అరి కట్టాల్సింది పోయి ఇలా లంచాలు తీసుకోవడం సిగ్గుచేటని స్థానికులు విమర్శిస్తున్నారు. అయితే గతంలో గాజులరామారం సర్కిల్ టీపీఓగా విధులు చేపట్టిన ఇక్కడి జంట సర్కిల్ ల టీపీఓ  అక్కడ ఎన్నో అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. గాజులరామారం సర్కిల్ లో కూడా ఇలానే లంచాలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు హారతి ఇచ్చే వాడని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. అయితే సదరు టీపీఓ గండిమైసమ్మలోని ఓ ఇంటిలో తన వ్యక్తిగత కార్యాలయం ఏర్పరచుకొని, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని వసూళ్లకు తెగబడుతున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. అందుకు అనుగుణంగానే దుండిగల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రాస్తా హోటల్ పక్కన సెల్లార్ నిర్మాణం వద్ద, బహదూర్ పల్లిలోని నిరంజన్ కాలనీలో రెండు అనుమతులు తీసుకొని ఒకటే నిర్మాణం చేపడుతున్న నిర్మాణదారుల నుండి లక్షల్లో వసూళ్లు చేశాడని సమాచారం. ఇలా ఎక్కడైనా సరే తనదైన శైలిలో నిర్మాణదారులను బెదిరించి లక్షల్లో దండుకుంటున్నాడు. 

 సీఎంసీ కమిషనర్ దృష్టి సారించేనా.... 

మూడు రోజుల క్రితం అంజయ్య నగర్ లో అక్రమ భవనం కూలి పోవడంతో సిఎంసీ కమిషనర్ సృజన అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో  ఏసీబీ అధికారులు, సీఎంసీ కమిషనర్ దుండిగల్, నిజాంపేట్ సర్కిల్ టీపీఓ విధులపై నజరు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.సీఎంసీ కార్పొరేషన్ ఆదాయంకు భారీగా నష్టం తెస్తూ... తమ స్వంత ఖాతాలోకి ప్రజాధనం లూటీ చేస్తున్న ఇలాంటి అవినీతి అధికారులపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.