26 August, 2026 | 4:10 PM

ఆధార్ కేంద్రంలో అదనపు వసూళ్లు..?

26-08-2026 03:25 PM

నిబంధనలున్నా అమలుసున్నా

యూఐడీఏఐ నిర్ణయించిన రుసుముల కంటే అధికంగా వసూలు

మానకొండూరు, ఆగస్టు 26 (విజయక్రాంతి): మండల పరిధిలోని కొన్ని ఆధార్ నమోదు/నవీకరణ కేంద్రం నిర్వాహకులు  భారతదేశపు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యు ఐ డి ఎ ఐ) (  యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్దేశించిన రుసుముల కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధార్ సేవల కోసం ప్రభుత్వం, యుఐడిఎఐ నిర్ణయించిన రుసుములకు మించి వివిధ పేర్లతో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నట్లు కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 

ప్రజలకు ఆధార్ సేవలు అందించే కేంద్రాల్లో యుఐడీఏఐ నిర్దేశించిన రుసుములనే వసూలు చేయాలని నిబంధనలున్నా అమలు సున్నాగా మారింది. అదనంగా “సర్వీస్ ఛార్జ్”, “ఆపరేటర్ ఛార్జ్”, “ప్రాసెసింగ్ ఛార్జ్” తదితర పేర్లతో అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయితే అది యుఐడిఏఐ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడే అవకాశం ఉంది.

నిర్ణీత రుసుములే వసూలు చేయాలి

యుఐడిఏఐ నిర్దేశించిన ప్రస్తుత రుసుముల ప్రకారం, సేవను బట్టి నిర్ణీత ఫీజు మాత్రమే వసూలు చేయాలని నిబంధనలున్నాయి .(సేవలు):కొత్త ఆధార్ కార్డు నమోదు (ఉచితం).బయోమెట్రిక్ అప్‌డేట్ (వేలిముద్రలు, ఐరిస్, ఫోటో మార్చడం).డెమోగ్రాఫిక్ వివరాల మార్పు (పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబరు, ఉదాహరణకు, ప్రత్యేకంగా నిర్వహించే డెమోగ్రాఫిక్ అప్డేట్‌కు రూ.75, ఆధార్ కేంద్రంలో డాక్యుమెంట్ అప్డేట్‌కు రూ.75, వర్తించే సందర్భాల్లో బయోమెట్రిక్ అప్డేట్‌కు ₹125 రుసుము ఉంటుంది. కొత్త ఆధార్ నమోదు సాధారణంగా ఉచితం. ప్రస్తుతం 5-15 సంవత్సరాల వారికి బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం. కాగా వీరి వద్ద  రుసుములు వసూలు చేసి ఆధారం ఎన్రోల్మెంట్ చేస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి.

అధిక వసూళ్లపై యుఐడిఎఐ నిబంధనలు

ప్రస్తుత యుఐడీఏఐ (01-04-2025) నుంచి అమల్లో ఉన్న విధానం ప్రకారం, ఆధార్ నమోదు/అప్డేట్ సేవలకు అధికంగా రుసుములు వసూలు చేయడంపై సంబంధిత ఆపరేటర్‌పై సస్పెన్షన్ వంటి చర్యలు, అలాగే సంబంధిత రిజిస్టర్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ పై వర్తించే ఆర్థిక, లేదా ఇతర చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  గత యుఐడిఏఐ అమలు విధానాల్లో , అధిక వసూళ్లను తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తూ ఆపరేటర్‌పై సస్పెన్షన్, డిస్అసోసియేషన్,ఆర్థిక జరిమానా వంటి చర్యలు తీసుకోవచ్చనే నిబంధనలున్నా, కొంతమంది నిబంధనలను తోసి రాజనటం ఇక్కడ గమనార్హం. 

మండల రెవెన్యూ అధికారుల దృష్టికి

ఆరోపణలు వాస్తవమని తేలితే, సంబంధిత అధికార యంత్రాంగం ఈ విషయాన్ని యుఐడిఏఐ సంబంధిత రిజిస్టర్, ఎన్రోల్మెంట్ ఏజెన్సీ  దృష్టికి తీసుకెళ్లి, అమల్లో ఉన్న యుఐడిఎఐ నిబంధనలు, విధానాల ప్రకారం తగిన చర్యలు తీసుకునేలా చూడాల్సి ఉంటుంది.

ఆధార్ కేంద్రాల్లో రుసుములు, ప్రజా సౌకర్యాలు

యుఐడిఏఐ నిబంధనలు — ఆధార్ చట్టం 2016 ప్రకారం ఆధార్ కేంద్రాల్లో యుఐడిఎఐ నిర్ణయించిన సేవా రుసుముల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలి. నిర్ణీత రుసుముకు మించి అదనపు ఛార్జీలు వసూలు చేయడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. కేంద్రాల్లో యుఐడిఎఐ నిర్దేశించిన పని చేసే కంప్యూటర్, ప్రింటర్, బయోమెట్రిక్ పరికరాలు, అవసరమైన సాఫ్ట్‌వేర్, ప్రజలకు అవసరమైన సమాచార ప్రదర్శన, తగిన సేవా సదుపాయాలు అందుబాటులో ఉండాలి. వృద్ధులు, దివ్యాంగులు ఇతర అవసరమైన వ్యక్తులకు తగిన సహాయం చేయాలనే నిబంధనలున్నాయి.

ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచన

ఆధార్ సేవలకు నిర్ణీత రుసుము కంటే అధికంగా డబ్బులు అడిగినట్లు, లేదా వసూలు చేసినట్లు ఎవరైనా ఎదుర్కొంటే, వారు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి

యూపీఐ ద్వారా చెల్లిస్తే ట్రాన్సాక్షన్ /స్క్రీన్‌షాట్ భద్రపరచాలి,  కేంద్రం పేరు, ప్రదేశం, తేదీ, సమయం నమోదు చేసుకోవాలి,  ఆధార్ సేవకు సంబంధించిన అకనాలెడ్జ్మెంట్ /( యుఆర్ఎన్) ను భద్రపరచాలి, కేంద్రంలో ప్రదర్శించే రుసుముల వివరాలను నమోదు/ఫొటోగా భద్రపరచాలి,  యుఐడిఏఐ హెల్ప్‌లైన్ 1947కు ఫిర్యాదు చేయాలి లేదా యుఐడిఎఐ అధికారిక గ్రీవెన్స్ వ్యవస్థను వినియోగించాలి.

ప్రజలకు అందించే ఆధార్ సేవల్లో పారదర్శకతను పాటిస్తూ, యుఐడిఏఐ నిర్ణయించిన రుసుములకే సేవలు అందించాలి. అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని సంబంధిత ఆధార్ కేంద్ర నిర్వాహకులకు హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆరోపణలపై సంబంధిత మండల రెవెన్యూ అధికారులు, యుఐడిఏఐ, సంబంధిత రిజిస్ట్రార్ తగిన స్థాయిలో పరిశీలన జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.