calender_icon.png 5 February, 2026 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులను పరిరక్షించి అభివృద్ధి చేయాలి

05-02-2026 12:19:12 AM

కలెక్టర్ కె.హరిత 

కుమ్రంభీం ఆసిఫాబాద్/వాంకిడి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): జిల్లాలో చిత్తడి నేలలుగా గుర్తించిన చెరువులను పరిరక్షించి అభివృద్ధి చేయాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, కాగజ్నగర్ డివిజన్ అటవీ అధికారి అప్పయ్య, శిక్షణ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్ కుమార్ తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెంచికల్పేట మండలంలోని ఎల్లూరు చెరువును ఇప్పటికే చిత్తడి నేలగా గుర్తించామని, దీని ద్వారా ఆక్రమణలను అరికట్టవచ్చని, అలాగే తిర్యాణి మండలంలోని చెలిమెల ప్రాజెక్టును కూడా చిత్తడి నేలగా గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రం లోని ఈవిఎం గోదామును నెలవారీ తనిఖీలలో భాగంగా పరిశీలించారు.

ప్రపంచ క్యాన్స ర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి నివారణకు వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే  సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది రెండో రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పంచాయ తీ అధికారి బిక్షపతి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, నీటిపారుదల శాఖ అధికారులు, ఎన్నికల విభాగ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ కె. హరిత అన్నారు. బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఐఎఫ్‌ఎస్ అధికారి బార్గవ్ కుమార్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, సరుకుల నిల్వ గదులను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.

10వ తరగతి విద్యార్థుల తో మాట్లాడి పరీక్షలకు సన్నద్ధతపై సూచనలు చేశారు. స్నానపు గదులు, టాయిలెట్లు సరిపోవడం లేదని విద్యార్థులు చెప్పడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, ఉపాధి హామీ పనులు, ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించి సౌకర్యాలు, పనుల నిర్వహణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.