ఆత్మగౌరవ ప్రతీక నీలికళ్ల నేల
ఎప్పుడో రాయాల్సింది, ఆలస్యంగా రాస్తున్నాను. అంతకుముందు ‘యాలై పూడ్సింది’ కవిత్వం ద్వారా పల్లిపట్టు కవిగా హృదయాన్ని కొల్లగొట్టాడు. అపుడు రాయాలనుకుని (చాలామంది రాశారు కదా.. అని ) నేను రాయలేక పోయాను. ఇపుడు అతని రెండో కవితా సంకలనం ‘నీలికళ్ల నేల’ చదివి కూడా రాయకపోతే, నన్ను నేను క్షమించుకో లేను. కొన్ని కవిత్వ పాదాలు అద్భుతంగా నేటి వర్తమాన సంక్షుభిత పరిస్థితిని ఎత్తి చూపుతున్నాయి.
‘మందు తాగుతూ నువ్వూ నేనూ/ మతం తాగుతూ దేశం/ కొంచెం కొంచెం మార్చురీ గదిలా దేశం’, ‘కాలిరిగిన ఈ కాలానికి ఏదో ఒక కట్టు గట్టాల...’ నేటి దళిత కవిత్వం సామాజిక చైతన్యానికి, ఆత్మగౌరవ పోరాటానికి ఒక బలమైన గొంతుక. వేల ఏళ్ల అణచివేతను, వివక్షను ఎదిరిస్తూ అక్షర రూపం దాల్చిన ధిక్కార స్వరమే నేటి దళిత కవిత్వం. అస్తిత్వ పోరాటం - ఆత్మగౌరవ గీతంగా మారింది.‘ఒక శవం స్వేచ్ఛగా నడిచినట్టు/ ఒక దేశం శవం ముందు తలకిందులా వేలాడినట్టు.. కొన్ని గాయాల రోదన’ పాత జ్ఞాపకాలకు కొత్త రూపం ఇచ్చే ప్రయత్నం, కేవలం కవిత్వంగా మాత్రమే కాదు..
ఒక సామాజిక చరిత్ర. వర్ణ వ్యవస్థ నిర్మించిన గోడలను కూల్చివేస్తూ, అంటరానితనం అనే అమానవీయ కోణాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం ఒక పార్శ్వం అయితే, హక్కుల్లో బాధ్యతల్లో అధికారంలో అన్నింటిలో నేలబారు జనం వాటా కోసం నీలిజెండా ఎత్తిపట్టి పిడికిలి బిగించి పోరాటం చేయడం ఇంకో పార్శ్వం. ఇందులోని ‘తరగతి గదిలో చీమలు’ చూశాక- మేం ఒకప్పుడు రాసుకున్న -‘ఎర్ర చీమల బారు దారి చూపుతోంది/పడండి గోడౌన్ల మీదకి’ గుర్తుకొచ్చింది.
నేటి దళిత కవిత్వం కేవలం ఒక వర్గానికి కులానికి సంబంధించినది కాదు. అది సమానత్వం కోసం పరితపించే ప్రతి మానవుడి ఆవేదన. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో, అట్టడుగు వర్గాలకు / కులాలకు ధైర్యాన్ని స్థుర్యైన్ని ఇవ్వడంలో ఈ కవిత్వం అగ్రభాగాన నిలుస్తుంది. ఇది కేవలం సాహిత్యం కాదు, ఒక సామాజిక యుద్ధం. మానసికంగా చేవ చచ్చిన పట్టు శాలువాలకు, బృహన్నల తరానికి నీలాంటి తోలుచెప్పుల కవిత్వం దారి చూపాలి.
రాబోయే తరానికి నెత్తుటి నినాదాలు నిప్పులతో కడిగి రాయాలి. దేశం మొండి శవాలకు దళిత ఛెర్నాకోలతో జవాబు చెప్పాలి. బ్రాహ్మణీక పెత్తందారీ వ్యవస్థను అడుగడుగునా తుత్తునియలు చేసి ప్రశ్నించే కవిత్వం ల్యాండ్ మైన్లుగా బద్దలవ్వాలి. ‘మీ నగర మేధ యాగంలో/ కూలిన మా ఇంటి శిథిలాల కింద ఇప్పుడైనా గొంతు ముట్టించు కోవాలి’ ఇలా ఎన్నని పేర్కొనాలి. ఇలాంటి ఆలోచనారమైన ఖండికలు ఎన్నో ఉన్నాయి.
అవి మనిషిలో నెత్తుటి రాగాలాపన చేయిస్తాయి. చేతిలో గునపం అందుకుని శత్రువు వెంట పడమంటాయి. ఎంతైనా కవిత్వాన్ని ఉదహరించుకుంటూ వ్యాఖ్యానించవచ్చు. రాసేవాడికి చదివే వాడికి సమయాభావం ముఖ్యం. అందుకే ఆపుతున్నాను. పల్లిపట్టు కవిత్వం బహుజనుల మనోభావాలను వేనోళ్ల చాటింపు వేయడం అటుంచి, వివక్షపై తిరుగుబాటు, కుల పోరాటాలు- అస్తిత్వ వేదన, శ్రమ జీవన సౌందర్యం, చరిత్ర పునర్నిర్మాణం, భాషా శైలి లోని మౌలికత, పల్లెటూరి పునాదులు, ఆధునిక సిద్ధాంతాల సాయుధ నిర్మాణం, ఫెమినిస్ట్ బలగం లాంటి వివిధ అంశాలను పునాదులుగా నిలబడింది. ‘నీ కులం వాసన ముందు, నా కూర వాసన ఏపాటిది ?’ ఈ సాంస్కృతిక ధిక్కారం పల్లిపట్టు నరనరానా కొనసాగుతోంది.
ఈ ధిక్కారమే ఒక నిర్మాణాత్మక సాంస్కృతిక విప్లవ కార్యాచరణగా ఎదుగుతుంది. కార్ల్ మార్క్స్,- అంబేద్కర్ అధ్యయనం రెండు కళ్లుగా అతని చూపు ఆంటోనియో గ్రామ్‌స్కీ అట్టడుగు అగాధాల జీవిత నేపథ్యాల పోరాటాలను ప్రతిబింబించాలని కోరుకుందాం. సన్మానాలు, పొగడ్తల అగాధాల్లోకి జారిపోకుండా అస్తిత్వాన్ని, అవలోకనాన్నీ చివరి వరకూ కాపాడుకుంటూ కవిగా జాగరూకుడవై ఎవరెస్టు అంత ఎదగాలనీ, మనిషిగా సముద్రమంత లోతు అధ్యయనం చేయాలని సహచరుడిగా కోరుకుంటున్నాను. అధ్యయనం- ఆచరణ మనల్ని రెండు వైపులా పదను ఉన్న కత్తి లాగా తయారు చేస్తుందని ఆశ్వాసిస్తూ, మరిన్ని కవిత్వ అద్భుతాలను పల్లిపట్టు సృష్టించాలని ఆశిస్తాను.
ఏఎన్ ప్రతులకు: https://chaayabooks.com/




