18-02-2026 12:24:22 AM
స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ముఖ్య కార్యదర్శి తదితరులు
అచ్చంపేట / నాగర్ కర్నూల్ , ఫిబ్రవరి 17 (విజయక్రాంతి):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్ రాజ్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తదితరులు కలిసి అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపనకు ప్రతిపాదించిన 20 ఎకరాల స్థలాన్ని మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని దేశంలోనే అతిపెద్దదిగా నిర్మించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని తెలిపారు.స్థానిక పరిస్థితులు, భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు పరిశీలించి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
ప్రతిపాదిత స్థలం నల్లమల్ల అటవీ ప్రాంతం పరిధిలో ఉండటంతో అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని, మద్దిమడుగు ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతర తరహాలో మద్దిమడుగు ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ మాట్లాడుతూ విగ్రహ ఏర్పాట్లకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ రానున్న ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్, ఆల్ ఇండియా బంజారా నాయకుడు రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.