calender_icon.png 20 December, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులం మత్తు.. దిగనీకి టైమ్ పట్టింది!

20-12-2025 01:48:48 AM

‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన నిర్మాణ సంస్థ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్. రవీంద్ర బెనర్జీ ముప్పానేని సారథ్యంలోని ఈ సంస్థ రూపొందిస్తున్న తాజాచిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక చిక్కాల, మౌనికారెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఊరిలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నవదీప్ సర్పంచ్‌గా ఎన్నికవుతాడు. అప్పట్నుంచి ఊరిలో వచ్చే సమస్యలు.. కుల పెద్దలకు, అతనికి వచ్చే ఘర్షణలు ఎలా ఉంటాయనే విషయాలను సన్నివేశాల రూపంలో చూపించారు. 

శివాజీ పాత్ర, బిందుమాధవి పాత్రల మధ్య ప్రేమ, భావోద్వేగ సన్నివేశాలను హృద్యంగా చూపించారు. నందు పాత్రతో పాటు రవికృష్ణ, మణిక పాత్రల మధ్య ప్రేమ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘మన చావు పుట్టకులన్నీ ఆ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు..’, ‘చావు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేం రా..’, ‘ఒకటి పెళ్లి దగ్గర.. లేకపోతే చావు దగ్గర.. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి’, ‘కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది పొద్దుగల్ల దిగనీకి.. కులం మత్తు సార్.. టైమ్ పట్టింది..’, ‘మన బతుకులు మారాలంటే మనకు కావాల్సిందొక్కటి.. చదువు.. చదువు..’ అంటూ సాగే డైలాగులు ఆకట్టుకున్నాయి.