6 May, 2026 | 1:55 AM

పాలకులకు ప్రజలు నేర్పిన గుణపాఠం

06-05-2026 12:00 AM

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు పాతుకుపోయిన ప్రభుత్వాల పరాజయం ఒక ఆకస్మిక ఘటన కాదు. ఇది దశాబ్దాలుగా నాటుకుపోయిన అసంతృప్తి, మారుతున్న సామాజిక సమీకరణాలు, పాలకుల అహంకారం మేళవించిన ఒక చారిత్రక పరిణామం. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, తాము నిర్మించుకున్న ‘రాజకీయ కోటలు’ ఎప్పటికీ బద్దలుకావని నమ్మడమే.

కాలం మారు తున్నకొద్దీ ప్రజల ఆకాంక్షలు మారుతుంటాయి, కానీ పాలకులు మాత్రం పాత తరం సిద్ధాంతాలకు బందీలైపోయారు. మూలాల వరకు వెళ్లి ఈ ప్రజాతీర్పు వెనుక ఉన్న అసలు సత్యాన్ని విశ్లేషిద్దాం. ఈ పరాజయాలకు మొదటి మూలకారణం ‘అతి విశ్వాసం, సంస్థాగత స్తబ్ధత’. ప్రభుత్వమంటే పార్టీ కార్యకర్తలు లేదా కొందరు నాయకుల గుత్తాధిపత్యం అనే భావన ప్రజల్లోకి బలం గా వెళ్లింది. పాలకులు క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని గుర్తించలేకపోయారు.

ముఖ్యంగా బెంగాల్‌లో ఇదే జరిగింది. దశాబ్దాల తరబడి పార్టీ క్యాడర్ సామాన్యుల జీవితాలను శాసించడం, చిన్న చిన్న పనులకూ పార్టీ అనుమతి తప్పనిసరి కావడం వంటివి ప్రజల్లో ఊపిరాడని పరిస్థితిని కల్పించాయి. ఇది తెలియక చేసిన తప్పు కాదు, అధికారంలో ఉంటే ఏది చేసినా చెల్లుతుందనే ‘తెలిసి చేసిన అపరాధం’. ఫలితంగా, మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఒక బలమైన ప్రత్యామ్నాయం దొరకగానే, వారు పాత వ్యవస్థను వేళ్లతో సహా పెకిలించేశారు.

రెండవ కారణం ‘ఆర్థిక అసమానతలు, ఉపాధి కల్పనలో వైఫల్యం’. కేరళం, తమిళనాడు వంటి రాష్ట్రాలు విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచినప్పటికీ, యువతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయి. ఉచిత పథకాలు ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చగలవేమో కానీ, వారి ఆత్మగౌరవానికి సరిపోయే ఉపాధిని ఇవ్వలేవు. కేరళంలో విదేశీ వలసలు పెరగడం, స్థానికంగా పరిశ్రమలను ప్రోత్సహించకపోవడం ఒక రకమైన ఆర్థిక నిస్తేజాన్ని తెచ్చింది.

విద్యావంతులు వలసపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం. ప్రజలు తమ జీవితాల్లో గుణాత్మక మార్పు కోరుకున్న నేపథ్యంలో రేషన్ బియ్యం లేదా ఉచిత టీవీలు వారిని సంతృప్తిపరచలేకపోయాయి. ఈ ప్రభుత్వాలు ప్రజల కడుపు నింపే ప్రయత్నం చేస్తూ, వారి మేధస్సుకు, ఎదుగుదలకు కావాల్సిన మార్గాలను మూసివేశాయి. మూడవది, ‘రాజకీయ ప్రత్యామ్నాయాల ఆవిర్భావం, ఓటరు మనస్తత్వంలో మార్పు’.

ఒకప్పుడు ఓటర్లు కులం లేదా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. కానీ, నేటి ఓటరు, ముఖ్యంగా యువత, అత్యంత విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తున్నారు. తమిళనాడులో కరుణానిధి, జయలలిత వంటి మహావృక్షాల తర్వాత ఆ స్థాయి ప్రజాకర్షణ ఉన్న నాయకత్వం లేకపోవడం, పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు ప్రజల్లో అయోమయాన్ని సృష్టించాయి. అధికార పార్టీ నాయకులు ప్రజలతో బంధాన్ని తెంచుకుని, కొందరు ‘అంతరంగిక సలహాదారుల’ మాటలకే పరిమితమయ్యారు.

దీనివల్ల ప్రజల అసలు బాధలు పాలకులకు చేరలేదు. పాల కపక్షాలు ఒకే రకమైన భావోద్వేగాలను, అంటే ప్రాంతీయవాదం లేదా సిద్ధాంతాలను పదేపదే నమ్ముకోవడంతో ప్రజల్లో విసుగుపుట్టింది. ఇక్కడ ప్రజలు అధికార పార్టీని ఓడించడమే కాకుండా, పాత పద్ధతులనూ తిరస్కరించారు. నాల్గవ అంశం ‘ప్రజాస్వామ్య విలువల పతనం, అవినీతి’. అధికారం సుదీర్ఘకాలం ఒకేచోట కేంద్రీకతమై ఉండటం వల్ల వ్యవస్థలో అవినీతి క్యాన్సర్‌లాగా పాకిపోయింది.

ప్రభుత్వాలు తాము చేసే తప్పులను కప్పిపుచ్చగలమని అనుకున్నాయి. కానీ, ప్రజలు తమ నిశ్శబ్దాన్ని ఓటు రూపంలో ఆయుధంగా మార్చుకున్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉండాల్సిన సహజమైన బంధం తెగిపోవడం వల్లనే ఈ భారీ పతనాలు సంభవించాయి. పాలకులు ప్రజల మౌనాన్ని ‘సమ్మతి’గా భావించారు, కానీ ఆ మౌనం ఎన్నికల రోజున సునామీలా మారి సామ్రాజ్యాలను కూల్చేసింది. ఈ మూడు రాష్ట్రాల్లో పాలకులు ఓడిపోవడానికి మూలకారణం వారు తమను తాము ప్రజల కంటే ఉన్నతులుగా భావించడం.

ప్రజా తీర్పు ఒక హెచ్చరిక; అది పాలకులను మార్చడమే కాదు, ప్రజల పట్ల పాలకులకు ఉండాల్సిన జవాబుదారీతనాన్ని గుర్తుచేయడం. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిని, అహంకారాన్ని ప్రజలు మర్చిపోతారని అనుకోవడం పాలకుల అజ్ఞానం. ప్రజాస్వామ్యంలో ఏదీ శాశ్వతం కాదని, పని తీరు, ప్రజా స్పందన మాత్రమే రక్ష అని ఈ తీర్పులు నిరూపించాయి. ఈ రాష్ట్రాల్లో తీర్పులు పాలనా సంస్కరణలు కోరుకునే ప్రజల చైతన్యానికి నిదర్శనం.

 డీ చంద్రభాను