స్కీముల ప్రభుత్వం కావాలి
- స్కామ్‌ల ప్రభుత్వం కాదు
- దేవుణ్ణి మోసం చేసిన రేవంత్‌రెడ్డికి ప్రజలెంత?
- ఖమ్మంలో అభివృధి ద్యాస లేని ముగ్గురు మంత్రులు
- బొగ్గు బావిలను బొంద పెట్టిన కాంగ్రెస్
- మాజీ మంత్రి హరీశ్‌రావు
అశ్వారావుపేట/సుజాతనగర్, జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణకు స్కాముల ప్రభుత్వం కాదు స్కీముల ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో మాత్రం వందలాది స్కీములను అమలు చేశామని, కాంగ్రెస్ హయాంలో వేలాది కోట్ల రూపాయల స్కాములు జరిగాయని ఆరోపించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి సాక్షిగా రుణమాఫీ అమలు చేస్తానని ఎగ్గొట్టారని దేవుని మోసం చేసిన సీఎంకు ప్రజలు ఎంత అని అన్నారు. ఖజానాలో సొమ్ము లేక కాదని సీఎంకు మనసు లేక ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేయడం లేదని అన్నారు.
రైతాంగానికి 29 వేల కోట్ల రూపాయల రైతుబంధును ఇప్పటివరకు ఎగ్గొట్టారని విమర్శించారు. పనిచేయని సీఎంకు కోట్లాది రూపాయలతో క్యాంపు కార్యాలయాలు ఎందుకని నిలదీశారు. కేవలం కమీషన్లు వచ్చే పనులు మాత్రమే రేవంత్ సర్కార్ నిర్వహిస్తుందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకి కూడా డబ్బు మీద ఉన్న ధ్యాస అభివృద్ధి మీద లేదని ధ్వజమెత్తారు.
మండలంలోని పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. అలాగే సీతారామ ప్రాజెక్టుకి కనీసం కాలువలు తవ్వి రైతులకు నీటిని కూడా ఇవ్వలేకపోతున్న దద్దమ్మ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న సర్‌పై పార్టీ శ్రేణులు అప్రమత్తతో ఉండాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులకు సూచించారు.
రాష్ట్రానికి వెలుగునిచ్చే సింగరేణి చీకటి మయంగా మార్చిన కాంగ్రెస్‌కు కార్మికులు, ప్రజలు బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైందని అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో టెండర్ విధానాన్ని తెచ్చిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి చెందిన బామ్మర్ది సుజన్ రెడ్డికే దక్కటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీరాంపురం ఓసి లో రూ 600 కోట్లు అవినీతిని సోలార్ పవర్ ప్లాంట్ టెండర్లు రూ 1000 కోట్ల స్కాములు కాంగ్రెస్ చేపట్టిందని ఆరోపించారు.
సింగరేణి బావుల్లో 40 లక్షల టన్నుల బొగ్గు నిలవలు ఉన్నట్టు చూపించి లెక్కలు తారుమారు చేస్తూ సింగరేణిని నష్టాలు ఊబిలో కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టిందన్నారు. సింగరేణి సి ఎస్ ఆర్ నిధులతో రూ.100 కోట్లు సీఎం ఫుట్బాల్ పేరిట ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టారన్నారు.
ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు, రేగా కాంతారావు, దిండిగాల రాజేందర్, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, రావు జోగేశ్వరరావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కాపు కృష్ణ, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు, బానోత్ హరిప్రియ, తాతా మధు, రాకేష్‌రెడ్డి, దిండిగల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి పాల్గొన్నారు.






