calender_icon.png 14 February, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీల ప్రాణాలు హంగ్!

14-02-2026 01:40:58 AM

  1. త్రిశంకుస్వర్గంలో 36 మున్సిపాలిటీలు 
  2. ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీ 
  3. స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులపై గురి 
  4. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించిన పార్టీలు 
  5. ఎక్స్‌ఆఫీషియో ఓట్లపై ఆధారపడుతున్న పార్టీలు  

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : హోరాహోరీగా సాగిన పురపోరులో పట్టణ ఓటర్లు అత్యధిక మున్సిపాలిటీల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం పార్టీలను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మేజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ప్రధాన పార్టీలు స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగగా 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.

హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో దేవరకద్ర, ఆలంపూర్, దేవరకొండ, ఆలియాబాద్, కోహీర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, గద్వాల, క్యాతనపల్లి, జనగాం, జిన్నారం, నర్సాపూర్, జమ్మికుంట, వేము లవాడ, రాయికల్, ఇంద్రేశం, బెల్లంపల్లి, వర్దన్నపేట, జహీరాబాద్ ఉండగా, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మ్యాజిగ్ ఫిగర్‌కు తక్కువగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్‌అఫీషియో ఓట్లతో బయటపడాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు భావిస్తున్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీ లేదంటే ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడి ఓట్లు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థులతోనూ బేరసారాలు నిర్వహించి మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్, కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్‌కు ఎన్నికలు జరుగనున్నాయి.

ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా మెజార్టీ వచ్చిన మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన పట్టణాల్లో గెలుపొందిన అభ్యర్థులను కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు క్యాంప్ లకు తరలించారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి గెలుపొందిన వారిని కూడా క్యాంపులకు తరలించేందుకు ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దానితో పలుచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి.

కాంగ్రెస్, బీజేపీల మధ్య గొడవలు జరిగాయి. వర్ధన్నపేట 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి  షబారాణి ఓటు చైర్మన్ ఎంపికలో కీలకం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కిడ్నాప్ చేసినట్టు తండావాసులు ఆరోపిస్తున్నారు. ‘మా అభ్యర్థిని మాకు అప్పగించండి’ అని తండావాసులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కి వెళ్లి ధర్నాకు దిగారు. జనగామలోనూ అదే పరిస్థితి నెలకొన్నది.

స్వతంత్ర అభ్యర్థుల విషయంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఇలా హంగ్ ఏర్పడిన ప్రతి మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మధ్య గొడవలు జరిగాయి. 

మ్యాజిక్ ఫిగర్ దక్కని మున్సిపాలిటీలు..

* ఆసిఫాబాద్  (20 వార్డులు) : బీఆర్‌ఎస్9, కాంగ్రెస్7, ఇతరులు 4

* క్యాతనపల్లి (22 వార్డులు) : కాంగ్రెస్7, బీఆర్‌ఎస్10, బీజేపీ 1, ఇతరులు 4

* అమరచింత (10 వార్డులు) : కాంగ్రెస్3, బీఆర్‌ఎస్3, బీజేపీ 3, ఇతరులు 1

* దేవరకద్ర (12 వార్డులు) : కాంగ్రెస్6, బీఆర్‌ఎస్4, బీజేపీ 1, ఇతరులు 1

* అలంపూర్ (10 వార్డులు) : కాంగ్రెస్5, బీఆర్‌ఎస్5

* దేవరకొండ (20 వార్డులు) : కాంగ్రెస్10, బీఆర్‌ఎస్7, బీజేపీ 1, ఇతరులు 2

* కేసముద్రం (16 వార్డులు) : కాంగ్రెస్8, బీఆర్‌ఎస్8

* కోహీర్ మున్సిపాలిటీ   16 వార్డుల్లో కాంగ్రెస్8, బీఆర్‌ఎస్5, బీజేపీ 1, ఇతరులు 2

* వేములవాడ (28 వార్డులు) : కాంగ్రెస్13, బీఆర్‌ఎస్5, బీజేపీ 8, ఇతరులు 2

* జమ్మికుంట (30 వార్డులు) : కాంగ్రెస్ 10, బీఆర్‌ఎస్ 12, బీజేపీ 4

* ఆలియాబాద్ (20 వార్డులు) : కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 7, బీజేపీ 3 

* గద్వాల (37 వార్డులు) : కాంగ్రెస్ 16, బీఆర్‌ఎస్ 11, బీజేపీ 7

* జనగామ (30 వార్డులు) : కాంగ్రెస్ 12, బీఆర్‌ఎస్ 13, ఇతరులు 5

* జిన్నారం (20 వార్డులు) : కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 8, బీజేపీ 4, ఇతరులు 2

* నర్సాపూర్ (15 వార్డులు) : కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 4

* రాయికల్ (12 వార్డులు) : కాంగ్రెస్ 3, బీఆర్‌ఎస్ 3, బీజేపీ 5, ఇతరులు 1 విజయం సాధించారు.

* జహీరాబాద్ (37 వార్డులు) : కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 15, బీజేపీ 3, ఇతరులు 5

* బెల్లంపల్లి (34 వార్డులు) : కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 5

* ఇంద్రేశం (18 వార్డులు) : కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 9, బీజేపీ 2, ఇతరులు 1

* వర్ధన్నపేట (12 వార్డులు) : బీఆర్‌ఎస్ 6, కాంగ్రెస్ 5, ఇతరులు 1