13 May, 2026 | 2:11 AM

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలి

13-05-2026 12:33 AM

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్, మే 12 (విజయక్రాంతి)తెలకపల్లి మండలం పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం, తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు.రైతులు పండించిన మొక్కజొన్నను విక్రయానికి తీసుకొచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రంలో తేమ శాతం నిర్ధారణ, తూకం విధానం, నిల్వ ఏర్పాట్లు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాముల్లో సక్రమంగా నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్దతు ధర ప్రకారం రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆపరేటివ్ అధికారి రఘునాథ్ రావు, కో-ఆపరేటివ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.