డీఈవోపై చర్యలు తీసుకోవాలి
బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, మే 12 (విజయక్రాంతి): అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ డీఈవోపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఆయనను కాపాడుతున్న ఉన్నతాధికారి ఎవరో బయట పెడతామని హెచ్చరించింది.
మంగళవారం నాడిక్కడ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్‌కు 18 నెలల క్రితం ఖమ్మం డీఈవో కార్యాలయంలో ఏడిగా పోస్టింగ్ ఇచ్చి, మహబూబ్‌నగర్ డీఈవోగా ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారన్నారు. ఏడిగా జాయిన్ కాకపోవటంతో ఖమ్మం కలెక్టర్ తిరస్కరించడంతో అక్కడి నుంచి సూర్యాపేట డీఈవో కార్యాలయ ఏడిగా పోస్టింగ్ ఇచ్చారు.
ఖమ్మంలో ఏడిగా చేరకుండా, మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయానికి సక్రమంగా రాకుండా 18 నెలల పాటు జీతం పొందని ప్రవీణ్‌కుమార్‌కు మళ్లీ సూర్యాపేట ఏడిగా పోస్టింగ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. డీఈవో నిర్వాకం వల్ల కొంతమంది కేజీబీవి టీచర్లకు ఏడాది నుంచి జీతాలు కూడా రావటం లేదని మండిపడ్డారు. డీఈఓపై ఆర్జేడీ సోమిరెడ్డి ఎందుకు విచారణ జరపడం లేదని ఆరోపించారు. జేఏసీ నాయకులు యశ్వంత్‌గౌడ్, లోకేష్ పాల్గొన్నారు.






