గండి జల సవ్వడి
- పర్యాటకుల మదులను దోస్తున్న జలపాతాలు
- హాట్ టూరిస్ట్ స్పాట్‌గా గండిరామారం మల్లన్నగండి రిజర్వాయర్
జనగామ జిల్లా నర్మెట మండలంలోని గండిరామారం మల్లన్నగండి రిజర్వాయర్, వాటర్‌పాల్స్ ఇప్పుడు జిల్లాలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఈ మధ్య కురుస్తున్న వర్షాలతో జలపాతాల గలగలా సవ్వడులు పర్యాటకుల మదులతో దోబూచులాడుతూ.. గిలిగింతలు పెడుతున్నాయి. ప్రకృతి ప్రేమకులు ప్రకృతివడిలో సేదతీరుతూ పరవశించిపోతున్నారు. దీంతో ప్రతి శని, ఆదివారాలు వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వచ్చి, ఆహ్లాదంతో కేరింతలు కొడుతున్నారు.
నీలి రంగు రిజర్వాయర్, పక్కనే నురుగులు చిమ్ముతూ కిందకు దూకే జలపాతం చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి, పలు జిల్లాల నుంచి కుటుంబాలు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చి, ఫొటోలు, వీడియోల తీసుకుంటూ.. మైమరిచిపోతూ సంతోషిస్తున్నారు. రైతుకు నీరిచ్చిన గండి.. ఇప్పుడు పర్యాటకుల వడిలో పులకించిపోతోంది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో మల్లన్నగండి రీల్స్ మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. ‘హైదరాబాద్ దగ్గర్‌లో ఇంత అందమైన ప్రదేశం ఉందా?‘ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది.
స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం
పర్యాటకుల రాకతో స్థానికంగా టీ బంకులు, చిరు వ్యాపారాలు, ఆటోలు, బైక్ రైడ్లకు డిమాండ్ పెరిగింది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే కనీస వసతులు కరువయ్యాయి. రోడ్డు సౌకర్యం లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. గుంతలు రోడ్డుతో సతమతమవుతున్నారు. సైన్ బోర్డులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. తాగునీరు, మరుగుదొడ్లు పార్కింగ్, చెత్త డబ్బులు లేక ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయే అవకాశం ఉందంటున్నారు.
కావున సంబంధిత అధికారులు స్పందించి పర్యాటక ప్రాంతంగా ప్రకటించి, వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేస్తే జనగామ జిల్లా ప్రధాన టూరిజం కేంద్రంగా మారుతుంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, స్థానికులకు ఉపాధి లభిస్తుందని ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అభిప్రాయ పడుతున్నారు. అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో బోటింగ్, వ్యూ పాయింట్, పార్క్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మల్లన్నగండి తెలంగాణ టూరిజం మ్యాప్‌లో ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని అంచనా. రైతులకు జీవనాధారమైన ఈరిజర్వాయర్ ఇప్పుడు జనగామ జిల్లాకు గర్వకారణం గా, టూరిస్టు హబ్‌గా మారుతుంది.
రమేష్ యాదవ్, జనగామ, విజయక్రాంతి






