లేబర్ కోర్టు ఉత్తర్వులు సబబే
టాటా బోయింగ్- కార్మికుల వివాదంపై హైకోర్టు
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌కు, అందులోని కార్మికుల తొలగింపునకు సంబంధించిన వివాదంలో కార్మికులు సమర్పించిన అదనపు సాక్ష్యాలను అనుమతిస్తూ కార్మిక న్యాయస్థానం జారీచేసిన ఉత్తర్వులు సబబేనని హైకోర్టు ప్రకటించింది. లేబర్ కోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని బుధవారం స్పష్టం చేసింది. అదనపు ఆధారాలపై వివరణ ఇవ్వడానికి టాటా బోయింగ్ సంస్థకు అవకాశం ఉన్నందున కార్మిక న్యాయస్థానం సరైన నిర్ణయమే తీసుకుందని తేల్చింది.
కార్మిక న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. తమను ఉద్యోగాల నుంచి తొలగించడంపై కార్మికులు దాఖలు చేసిన పిటిషన్లలో అదనపు ఆధారాలు, పత్రాలను అనుమతిస్తూ 2021 ఫిబ్రవరిలో కార్మిక న్యాయస్థానం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆదిభట్లలోని టాటా బోయింగ్ సంస్థహైకోర్టులో 38 పిటిషన్లు దాఖలు చేసింది. వీటిని జస్టిస్ పీ మాధవీదేవి విచారించారు.






