30 June, 2026 | 2:28 PM

అక్రమ కట్టడాల కూల్చివేతపై రగడ

13-06-2024 01:33 AM

కామారెడ్డిలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం

కామారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి): కామారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బుధవారం ఎమ్మెల్యే, కాంగ్రెస్ కౌన్సిల ర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కామారెడ్డిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తొలగించుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇటీవలే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కోరారు. అందుకు ప్రజలు రెండు నెలలు సమయం కోరారు. గడువు ముగియకముందే బుధవారం మున్సిపల్ అధికారులు కామారెడ్డి పట్టణ సరిహద్దులో ఉన్న వసుధ హోటల్‌ను ప్రొక్లెయిన్ ద్వారా తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి, గడువుకు ముందే కూల్చివేతలు చేపట్టడం ఏమిటని కమిషనర్ సుజాతను, టౌన్‌ప్లానింగ్ అధికారి గిరిధర్‌ను ప్రశ్నించారు.

వారు సమాధానం చెప్పకుండా దాటవేస్తుండడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు చాట్ల వంశీ, పాత శివకృష్ణమూర్తి ఒత్తిడితోనే వసుధ హోటల్‌ను కూల్చివేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇంతలోనే కాంగ్రెస్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.

తాము ఎవరిని డబ్బులు డిమాండ్ చేశామో చూపించాలని, అనవసరంగా ఆరోపణలు చేయడం తగదన్నారు. దీంతో ఎమ్మెల్యే వెంట ఉన్న బీజేపీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు మున్సిపల్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను అడ్డుకున్నారు. అనంతరం అధికారులు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేతో సమావేశం నిర్వహించారు. గడువు ఇచ్చి, నోటీసులు జారీ చేసిన తర్వాత అక్రమ నిర్మాణాలు తొలగించాలని తీర్మానించడంతో వివాదం సద్దుమనిగింది.