మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి
రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): మొక్క జొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. యాసంగి- 2026లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పాటు అధిక దిగుబడులు నమోదవుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్‌తో మొక్కజొన్న కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలు, వాటికి పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. కాగా మొక్కజొన్న మార్కెట్‌కు అధికంగా వస్తున్నందున, ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమిస్తూ, వ్యవసాయశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.






