8 May, 2026 | 1:57 AM

పర్సంటేజ్ విధానమే అందరికీ లాభదాయకం!

08-05-2026 01:02 AM

టాలీవుడ్‌లో ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవర మాయే మదిలో’ లాంటి సినిమాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్న మోహన్ వడ్లపట్ల మరో కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈసారి దర్శకునిగా మారారు. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ మే 8న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సినిమా సంగతులు, తన కెరీర్ గురించి మోహన్ వడ్లపట్ల చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే.. “అమెరికాలో సీరియల్ కిల్లర్స్ కాన్సెప్ట్ చాలా ఫేమస్. వాట్ ఈజ్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అని ఆలోచించినప్పుడు, మోటివ్ ఫర్ మర్డర్ అని ఫిక్స్ అయ్యాం. దానికి షార్ట్ కట్‌గానే ‘ఎం4ఎం’ అని టైటిల్ పెట్టాం. హాలీవుడ్ స్టైల్‌లో 90 నిమిషాల సినిమాగా సిద్ధం చేశాం. ఇంటర్వెల్ కూడా అవసరం లేదు, కానీ మనవాళ్లకు అలవాటు కాబట్టి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టాం. ఈ సినిమా ఇండియాలో 8న విడుదలైతే, 7నే అమెరికాలో రిలీజ్ చేస్తున్నాం. సీరియల్ కిల్లర్‌ను కనుక్కున్నవాళ్లకు రూ.లక్ష రివార్డ్ ఇస్తాం.

కిల్లర్ ఎవరనే సస్పెన్స్ సినిమా చివరి వరకు ప్రేక్షకులను వెంటాడుతుంది. అందుకే ఎవరైనా కిల్లర్ పేరు చెప్పినా, వారు పూర్తి కథను గెస్ చేయలేరని నా నమ్మకం. నేను హాలీవుడ్‌లో టామ్ హాంక్స్ లాంటి వాళ్ల వర్క్‌ను ఫాలో అవుతుంటా. నేను నిర్మించిన సినిమాలకు ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఇప్పుడు థియేటర్లలో పర్సంటేజీల గొడవ నడుస్తుంది. నేనెప్పుడూ పర్సంటేజ్ సిస్టమ్‌కే మద్దతిస్తా. 98% నిర్మాతలు దీనికి అంగీకరించారు.

ఇప్పుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓటీటీల వల్ల ఆడియన్స్ థియేటర్లకి రావడం తగ్గింది. కాబట్టి ప్రొడ్యూసర్స్, థియేటర్ ఓనర్స్ పర్సంటేజ్ విధానం పాటిస్తే అందరికీ లాభదాయకం. ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగులోనూ చెప్పా. ఒక మేకర్‌గా నాకు కొత్తదనం అంటే ఇష్టం. మున్ముందు కూడా విభిన్నమైన కథలతోనే సినిమాలు వస్తాయి” అని తెలిపారు.