27 May, 2026 | 3:09 AM

మండుటెండల్లో ‘ఉపాధి’ కూలీల అవస్థలు

27-05-2026 02:06 AM

-పనివేళల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

వెంకటాపూర్, మే 26 (విజయక్రాంతి): మండలంలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామ చెరువులో కొనసాగుతున్న పూడికతీత ఉపాధి హామీ పనుల్లో ప్రతిరోజూ సుమారు 100 మంది కూలీలు పాల్గొంటున్నారు. మండుతున్న ఎండల్లో కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పనివేళల్లో మార్పులు చేయాలని గ్రామస్థులు, కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ సందర్భంగా విలేజ్ హెల్పింగ్ హాండ్స్ ఫౌం డర్ అశోక్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే పనులకు హాజరై ఉదయం 11 గంటల వరకు మండుటెండల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం లో కూలీలు తీవ్ర ఎండ వేడిమిని ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణలో అత్యధిక ఉష్ణో గ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో ములుగు జిల్లా రెండో స్థానంలో ఉండటంతో కూలీల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోందని గ్రామస్థులు తెలిపారు.

మండుటెండల్లో పనిచేయడం వల్ల వడదెబ్బలు, నీరసం, డీహై డ్రేషన్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు గంటల ఆన్లైన్ అటెండెన్స్ను కనీసం ౩ గంటల పనిగా నమోదు చేయాలని, కూలీలు గంట ముందుగానే పనులు ముగించుకొని సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూలీల ప్రాణ భద్రతను దృష్టిలో పెట్టుకొని తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.