5 August, 2026 | 1:39 AM

ఖాకీ బాధ్యత.. వ్యవస్థకు భద్రత!

05-08-2026 12:40 AM
  1. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ ఆశయానికి సిబ్బంది బరితెగింపులతో గండి.. 
  2. దిద్దుబాటు దిశగా శాఖ సమగ్ర ప్రక్షాళన!

రంగారెడ్డి, అగస్టు 4(విజయక్రాంతి): ‘జన రక్షణ.. ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే నినాదంతో పోలీస్ వ్యవస్థ ప్రజలకు చేరువవుతున్న వేళ, కొందరు సిబ్బంది పాల్పడుతున్న అక్రమాలు రక్షక భటుల గౌరవానికి పరీక్షగా మారుతున్నాయి. రక్షణగా నిలవాల్సిన చేతులే నేరాలకు వేదికవుతుండటంతో ఉన్నతాధికారులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణవ్యాప్తంగా జరిగిన విచారణల్లో అడ్డంగా దొరికిపోయిన 8 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేయడం శాఖలో తీవ్ర కలకలం రేపింది.

ఆక్రమాలు  దందాలు:

గత 10 రోజులుగా వెలుగుచూసిన వివిధ ఘటనలు చట్టాన్ని రక్షించాల్సిన వారి బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. కరీంనగర్లో సివిల్ వివాదంలో ప్రత్యర్థిని ఇరికించేందుకు ఓ కానిస్టేబుల్ అర్ధరాత్రి వేళ గంజాయి దాచి దొరికిపోగా, మరొకరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అసలు నిందితులను తప్పించి కోర్టుకు డమ్మీ నిందితులను పంపే దందా నడిపారు. ఖమ్మంలో ఏకంగా ఏసీపీ కాంపౌండ్లోనే పనిచేసే కానిస్టేబుళ్లు దోపిడీ ముఠాలతో చేతులు కలిపి ప్లాన్లు వేయడం, మరో కానిస్టేబుల్ పేకాట శిబిరంలో కార్డులు పేర్చుతూ దొరకడం గమనార్హం.

నిర్లక్ష్యం  వేధింపులు:

 గచ్చిబౌలి ప్రమాద సమయంలో ’100’ అత్యవసర పిలుపును కేవలం ’న్యూసెన్స్’గా క్లోజ్ చేయడం, చెక్పోస్టుల వద్ద లారీ డ్రైవర్లను బెదిరించడం, నల్గొండలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు విధి నిర్వహణపై ప్రశ్నలు రేకెత్తించాయి.

కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ‘కర్తవ్యమే’ పరమావధి కావాలి..

ఈ వరుస ఘటనలు పోలీస్ వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్న తాధికారుల వరకు ప్రతి ఒక్కరిలో ’కర్తవ్య నిర్వహణ’ మాత్రమే ధ్యేయంగా మారాల్సిన సమయం ఆసన్నమైంది.

పర్యవేక్షణ పెరగాలి: 

కింది స్థాయి సిబ్బంది విధి నిర్వహణ, వారి ప్రవర్తనపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలి.క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజలతో మసలుకునే విధానంపై సిబ్బందికి క్రమం తప్పకుండా శిక్షణా తరగతులు నిర్వహించాలి. ప్రతి ఒక్క అధికారి తన పరిధిలో జరిగే అక్రమాలకు జవాబుదారీగా ఉండే వాతావరణం ఏర్పడాలి.

ఉన్నతాధికారుల స్పష్టమైన హెచ్చరిక:

ఇటీవల డీజీపీ సివి ఆనంద్ శాఖ పరం గా నిర్వహించిన పలు సమావేశాలలో  సి బ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ప్రజల నమ్మకమే పోలీస్ శాఖకు అసలైన బలం అని యూనిఫాం ఆసరాతో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.

శాఖ గౌరవానికి భంగం కలిగిస్తే కేవలం సస్పెన్షన్ మాత్రమే కాదు, ఉద్యోగం నుంచే డిస్మిస్ చేస్తాం అని హెచ్చరికలు సై తం జారీ చేశారు. పోలీస్ శాఖలో అత్యధికు లు ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో శ్ర మిస్తున్నప్పటికీ, కొందరి అనాలోచిత చర్య లు మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులు తీసుకుంటున్న కఠిన చర్యలు క్రమశిక్షణను పునరుద్ధరించడానికి, ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై మళ్లీ పూర్తిస్థాయి నమ్మకాన్ని నింపడానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.