తుంగతుర్తిపై పీసీసీకి నివేదిక
- సీల్డ్ కవర్‌లో అందించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- చర్యలపై సర్వత్రా ఉత్కంఠ
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ వర్గపోరు అంశంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశీలకుడు జగ్గారెడ్డి తన విచారణ నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు అందజేశారు. మంగళవారం గాంధీభవన్‌లో మహేష్‌కుమార్‌గౌడ్‌తో భేటీ అయిన జగ్గారెడ్డి ఏడు పేజీలతో కూడిన సమగ్ర నివేదికను సీల్డ్ కవరలో అందజేశారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి.
ఈ క్రమంలో నేతల మధ్య విభేదాలు ముదిరిపాకాన పడి దాడుల వరకు వెళ్లింది. దీంతో స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దేందుకు జగ్గారెడ్డిని ప్రత్యేక పరిశీలకుడిగా నియమించింది. ఈ క్రమంలో అక్కడి వివాదంపై గత నెల 25వ తేదీననే తన నివేదిక సమర్పించబోతున్నట్లు ప్రచారం జరింగింది. కానీ నివేదిక సమర్పించడానికి సిద్ధం అవుతున్న వేళ ఎస్సీ నియోజకవర్గంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిపత్యం చలాయిస్తున్నారని ఎమ్మెల్యే సామేల్ ఆరోపించారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో తన నివేదికను సమర్పించేందుకు జగ్గారెడ్డి మరికొంత సమయం తీసుకుని మంగళవారం పార్టీకి రిపోర్టును అందజేశారు. కాగా ముఠా తగవులపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
కాగా ఈ అంశంపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 7 పేజీల నివేదికలో వివాదాలను, పరిణామాలను స్పష్టంగా ప్రస్తావించానని, నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఫస్ట్ అని, ఆ తరువాత ఎంపీ, మంత్రులు వస్తారని, మూడో ప్రాధాన్యత కార్యకర్తల పక్షాన డీసీసీ అధ్యక్షుడికి ఉంటుందన్నారు. అదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బలమైన స్తంభాలని జగ్గారెడ్డి తెలిపారు.






